TANA : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 1978లో ఏర్పాటయింది. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, తెలుగువారి గుర్తింపును కాపాడేందుకు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఈ సంఘం ఏర్పాటైంది. సుమారు 50 వేల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. తానా ఏటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగువారిని ప్రోత్సహిస్తోంది. కొత్తగా వచ్చిన తెలుగువారికి అండగా నిలుస్తోంది. తానా ఏర్పాటయిన నాటి నుంచి ప్రతీ పదేళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తోంది. ఈ సభలకు అమెరికాతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తోంది. సత్కరిస్తోంది. పురస్కారాలు ప్రధానం చేస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జూలైలో తానా మహా సభలు నిర్వహించాలని తానా నిర్ణయిచింది. ఈ మహాసభలకు కో–ఆర్డినేటర్‌గా ఉదయ్ కుమార్ చాపలమడుగు, చైర్మన్‌గా గంగాధర్ నాదెళ్లను నియమించారు. తానా 2025 మహాసభలు జరిగే ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు నియమించిన ముగ్గురితో కూడిన కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సమావేశంలో ఆమోదించారు. 2025 జూలై మొదటివారంలో ఈ మహాసభలు డిట్రాయిట్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆనవాయితీగా…
ప్రతీ పదేళకు ఓసారి డిట్రాయిట్లో మహాసభలు నిర్వహించడం ఆనవాయితీగా కనిపిస్తోంది. 2005, 2015 సంవత్సరంలో కూడా డిట్రాయిట్‌లో తానా మహాసభలు జరిగిన విషయం విదితమే. ఇప్పుడు ఆ ఆనవాయితీ కొనసాగింపుగా 2025 మహాసభలకు వేదికగా డిట్రాయిట్ నిలవడం విశేషం. డిట్రాయిట్ అయితే తెలుగు కమ్యూనిటీకి దగ్గరగా ఉంటుందని, వచ్చిన అతిథులకు వసతి సౌకర్యాలు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత ఈసీ, బోర్డ్ డిట్రాయిట్‌ను ఎంపిక చేశారు.
ఏర్పాట్లు షురూ..
డెట్రాయిట్‌లో వచ్చే ఏడాది జులైలో నిర్వహించే తానా కాన్ఫరెన్స్ 2025కు రంగం సిద్ధమైంది. నోవీ సబర్బన్ షోప్లేస్‌లో జరిగే ఈ కాన్ఫరెన్సు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళిక కమిటీని నియమించినట్లు కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు. తానా, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డీటీఏ), శ్రీ వెంకటేశ్వర దేవాలయం, షిర్డీ సాయి సంస్థాన్, ఇండియా లీగ్ ఆఫ్ అమెరికాలో పలు నాయకత్వ బాధ్యతలతో పాటు, తానా 2005, 2015 సమావేశాలు, డీటీఏ 25వ, 40వ వార్షికోత్సవాలను సమర్ధవంతంగా నిర్వహించిన అనుభవం ఈ కమిటీ సభ్యులకు ఉంది. ఈ నెల చివరి నాటికి ఈ బృందం ప్రణాళిక నివేదికను అందించనుంది. క్టోబర్ 19 కిక్‌ఆఫ్ ఈవెంట్ కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌కు వాలంటీర్లుగా www.tanaconference.org ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీలో సభ్యులు వీరే :
– గంగాధర్ నాదెళ్ల (చైర్మన్) – నిధుల సేకరణ
– శ్రీనివాస్ కోనేరు (కెవికె) (కో–కోఆర్డినేటర్) ఆర్థిక, ఆదాయ విభాగాలు
–సునీల్ పాంట్ర (కాన్ఫరెన్స్ డైరెక్టర్) సాంస్కతిక, సాహిత్య కార్యక్రమాలు
– కిరణ్ దుగ్గిరాల (కార్యదర్శి) – ప్రణాళిక సమన్వయం
– జోగేశ్వరరావు పెద్దిబోయిన (కోశాధికారి) వేదిక, హోటళ్లు, భోజన ఏర్పాట్లు
– నీలిమ మన్నె (తానా ఉత్తర ప్రాంత ప్రతినిధి) పోటీలు, అలంకరణలు, మహిళలు, పిల్లల కార్యకలాపాలు