Perplexity CEO Aravind Srinivas: ఇన్‌స్టాగ్రామ్‌లో అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం నేర్చుకోవాలని పెర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ యూత్ కు సూచించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏఐ టెక్నాలజీకి అలవాటు పడని వారు భవిష్యత్తులో ఉద్యోగాలు సంపాదించుకోవడం కష్టమవుతుందని ఆయన హెచ్చరించారు. AI సిస్టమ్స్‌ను బాగా ఉపయోగించగలిగే వారికి ఉద్యోగాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆయన నొక్కి చెప్పారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని ఆయన గ్యారెంటీ ఇచ్చారు.
అయితే, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీకి అలవాటు పడడం కూడా చాలా మందికి కష్టమేనని అరవింద్ శ్రీనివాస్ అంగీకరించారు. మానవ జాతి ఎప్పుడూ ఇంత స్పీడుగా మార్పులకు అలవాటు పడలేదని ఆయన అన్నారు. ఏఐ టెక్నాలజీ ప్రతి మూడు నుండి ఆరు నెలలకు ఒకసారి మారుతోందని, ఇది మనుషులు ఎంత వేగంగా అలవాటు పడగలరో టెస్ట్ చేస్తుందని ఆయన గుర్తించారు. ఏఐ డెవలప్ మెంట్ కు అనుగుణంగా మారలేని కొంతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవడం ఖాయమని శ్రీనివాస్ అంచనా వేశారు. అయితే, ఉద్యోగాలు కోల్పోవడం వల్ల వచ్చే సమస్యకు సొంత బిజినెస్ లు ప్రారంభించడం ఒక పరిష్కారమని ఆయన సూచించారు.
Also Read: యెల్లోస్టోన్ కింద 86,000 కొత్త భూకంపాలు.. AIతో అద్భుత ఆవిష్కరణ!
ఏఐ టెక్నాలజీ ఇండస్ట్రీలో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నందున, కొత్త ఉద్యోగ అవకాశాలు పెద్ద కంపెనీల నుండి కాకుండా సొంత వ్యాపారాలు ప్రారంభించే వారి నుండి రావాలని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు సొంతంగా కంపెనీలు ప్రారంభించి ఏఐలను ఉపయోగించుకోవాలి, లేదా వారు ఏఐ టూల్స్ నేర్చుకుని కొత్త కంపెనీలకు ఉపయోగపడాలని ఆయన వివరించారు. ఏఐ వల్ల ఉద్యోగాలపై పడే ప్రభావం గురించి ఇతర టెక్ కంపెనీల అధిపతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడి ఇటీవల ఏఐ ఐదేళ్లలో 50శాతం వైట్-కాలర్ ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలను తొలగిస్తుందని అంచనా వేశారు.