AI Lay offs: ట్రెడిషనల్ ఐటి ఉద్యోగులకు ఉపాధి లభించడం లేదు. కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోజులో పడి అన్ని కంపెనీలు ఉద్యోగులను అడ్డగోలుగా తొలగిస్తున్నాయి. గడిచిన నాలుగు సంవత్సరాలుగా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా కోల్పోతూనే ఉన్నారు. కొత్త సాంకేతికత మోజులో పడిన ఐటీ కంపెనీలు ఉన్న ఉద్యోగులను మెడపట్టి బయటికి గెంటేస్తున్నాయి. బలవంతంగా రాజీనామా చేస్తూ.. వారి ఉసురు తీసుకుంటున్నాయి.
ట్రెడిషనల్ ఐటీ విభాగాలలో ఉపాధి లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక ఫ్రెషర్స్ అయితే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను సాంతం ఔపోసన పడుతున్నారు. కంపెనీలు కూడా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లో నైపుణ్యం ఉన్నవారికి భారీగా జీతాలు ఇస్తున్నాయి. అంతేకాదు భవిష్యత్తు ఐటీ అవసరాలు మొత్తం కూడా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడిన నేపథ్యంలో ఇంజనీరింగ్ కోర్సులలో కూడా.. పాఠ్యాంశాలను ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందిస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కు సంబంధించి ఒక వార్త ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు గాడ్ ఫాదర్ గా పిలిచే జెఫ్రీ హింటన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. 2026 నాటికి భయంకరమైన జాబ్ లెస్ బూమ్ వస్తుందని ఆయన హెచ్చరించారు. కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని.. కానీ మనుషులు అవసరం చాలా వరకు తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా గతంలో కొన్ని పనులు మాత్రమే జరిగేవి. ఇప్పుడు అన్నింట్లోనూ దాని వినియోగం పెరిగిపోయింది. గడిచిన ఏడు నెలలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం కొన్ని మిలియన్ రెట్లు పెరిగింది. వాస్తవానికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు కొన్ని నెలలపాటు సాగుతుందని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అది కేవలం గంటల వ్యవధిలోనే పూర్తవుతోందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల కంపెనీలు పూర్తిస్థాయిలో మానవ వనరులను తగ్గించుకుంటాయని.. ఆటోమేషన్ వైపు దృష్టిసారిస్తాయని ఆయన పేర్కొన్నారు. వైట్ కాలర్ ఉద్యోగాలు ఇకపై గత చరిత్ర అవుతాయని ఆయన హెచ్చరించారు.
ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి చాలావరకు తొలగింపుల వైపు వెళ్లిపోతాయని.. ఇప్పటికే అన్ని కంపెనీలు తొలగింపుల ప్రక్రియను విజయవంతంగా చేపడుతున్నాయని హింటన్ పేర్కొన్నారు. అయితే టేనియో వంటి కొన్ని సంస్థలు మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సరికొత్తగా చెప్పాయి. ఎంట్రీ లెవెల్ ఇంజనీర్లకు భారీగా అవకాశాలు ఉంటాయని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి గాడ్ ఫాదర్ గా ఉన్న హింటన్ చేసిన హెచ్చరికలు మాత్రం అందర్నీ ఇబ్బంది గురిచేస్తున్నాయి. ఈ ప్రకారం కొత్త ఉద్యోగాల కంటే.. తొలగించే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.. మరోవైపు 2026 లో టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారంతా తమను నిత్యం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సాగించే సునామీలో మునిగిపోక తప్పదు.