Artificial Intelligence : దుబాయ్ లో ఇప్పటికే గిటెక్స్ కంపెనీకి చెందిన ఏఐ రోబో పోలీసులకు పెట్రోలింగ్ లో సహాయం అందిస్తోంది. గంటకు 7 కిలోమీటర్ల పరిధిలో 360 డిగ్రీల కోణంలో పెట్రోలింగ్ చేస్తూ వెహికల్ రిపోర్టింగ్ అందిస్తోంది. ఎవరైనా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే రసీదు అందిస్తోంది.. కేవలం దుబాయ్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలు నేరాల నియంత్రణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి..ఇందుకు గానూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయాన్ని తీసుకుంటున్నాయి.. దుబాయ్ దేశంలో పోలీసు, సెక్యూరిటీ ఆపరేషన్లనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించిన రోబోలు నిర్వర్తిస్తున్నాయి.. దీనికోసం ఆ దేశంలో పోలీసు విభాగం అత్యాధునిక స్మార్ట్ యాప్ ను తయారుచేసింది. ఇందులో అమ్నా అనే పేరుతో ఒక ఫీచర్ రూపొందించింది. దీనిలో లెఫ్టినెంట్ ర్యాంకులో ఉండే ఒక వర్చువల్ పోలీసు అధికారిని ఏర్పాటు చేసింది. ఆ అధికారి ప్రజలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తారు. 2023లో దాదాపు 20,000 మందికి ఆ వర్చువల్ అధికారి సమాధానాలు ఇచ్చారు.
పెట్రోలింగ్ వాహనాల్లో కూడా..
పెట్రోలింగ్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించిన పోలీసు వాహనం సహాయం అందిస్తోంది. ఈ వాహనంలో 360 డిగ్రీల కోణాలలో వాహనదారుల కదలికలను గమనించే కెమెరాలు ఉంటాయి. ఒకవేళ ఆ వాహనంలో ఏవైనా మారణాయుధాలు ఉంటే వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం వెళుతుంది. పోలీసులు వచ్చేలోగా ఆ వాహనాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెహికల్ అనుసరిస్తుంది. ఇలా పదిహేను గంటల పాటు నిర్విరామంగా పనిచేసే సామర్థ్యం పెట్రోలింగ్ వాహనానికి ఉంటుంది.. ఈ వాహనాన్ని దాదాపు 65 మంది ఇంజనీర్లు ఐదు సంవత్సరాల పాటు కష్టపడి రూపొందించారు.
మనదేశంలో త్వరలో..
ఇక మనదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోలీసు వ్యవస్థ తెరపైకి రానుంది. మొబైల్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొబైల్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం లో ఉన్న సమాచారం ఆధారంగా.. తన పరిధిలో ఎవరైనా నేరస్థుడు కనిపించినా.. వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించేలాగా సాంకేతిక నిపుణులు ప్రోగ్రామింగ్ రూపొందిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో త్వరలో తొలి రోబో పోలీస్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కేరళ పోలీసులు అసీమోవ్ రోబోటిక్స్ అనే సంస్థతో కేపీ – బాట్ ను రూపొందించారు. ముఖ కవళికలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం తో నిందితులను పసిగట్టగల సామర్థ్యం దీని సొంతం.