Somireddy Chandra Mohan Reddy : భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు కాకా వికలం అయ్యాయి.రైలు మార్గాలతో పాటు రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. జనజీవనం కూడా స్తంభించింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.వాటి పునరుద్ధరణ పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. వరదల సమయంలో మాజీమంత్రి,టిడిపి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి ఆయనకు 30 గంటల సమయం పట్టింది.రెండు రైళ్లు,కార్లు, చివరకు బైక్ పై హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చింది.అయితే నెల్లూరు నుంచి రైలులో బయలుదేరిన ఆయన చివరకు కారులో వెళ్లాల్సి రావడం విశేషం. ఈ ప్రయాణంలో తాను పడిన బాధలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. గతంలో ఎన్నడూ ఇటువంటి ప్రయాణం చూడలేదని.. వర్షాలతో అవస్థలు పడ్డానని చెప్పుకొచ్చారు.
* స్పందించిన ఎర్రబెల్లి
నెల్లూరులో శనివారం రాత్రి 7:15 గంటలకు సింహపురి ఎక్స్ ప్రెస్ లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బయలుదేరారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.దీంతో సోమిరెడ్డి ప్రయాణిస్తున్న రైలును మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. ఆదివారం వేకువ జాము నాలుగు గంటలకు ఆ రైలు నిలిచిపోయింది. గంటల తరబడి వేచి చూసినా రైలు కదిలే పరిస్థితి లేదు. దీంతో ఆ స్టేషన్ లో దిగిపోయారు సోమిరెడ్డి. తన స్నేహితుడైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమాచారం ఇచ్చారు. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న మహబూబాబాద్ లోని స్నేహితులు సోమిరెడ్డికి ఆతిథ్యం ఇచ్చారు.అక్కడ మున్సిపల్ చైర్మన్ తో పాటు అన్ని పార్టీల నేతలు, పాత మిత్రులతో సోమిరెడ్డి చాలాసేపు గడిపారు. అనంతరం పద్మావతి ఎక్స్ప్రెస్ లో 11 గంటలకు ఖమ్మం బయలుదేరి వెళ్లారు.
* కొంత దూరం మోటార్ సైకిల్ పై
అయితే ఖమ్మం వెళుతుండగా పద్మావతి ఎక్స్ప్రెస్ ఉన్నపలంగా నిలిచిపోయింది. దీంతో అక్కడ నుంచి కొంత దూరం మోటార్ సైకిల్ పై.. మరి కొంత దూరం కారులో వెళ్లాల్సి వచ్చింది. చివరకు మధ్యాహ్నం రెండున్నర గంటలకు సోమిరెడ్డి ఖమ్మం చేరుకున్నారు. 50 కిలోమీటర్ల దూరాన్ని గంటలో చేరుకోవాల్సి ఉండగా.. వరదల కారణంగా మూడున్నర గంటల సమయం పట్టిందని సోమిరెడ్డి స్వయంగా వివరించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ ఆఫీసులో బస చేశారు సోమిరెడ్డి. చివరకు సాయంత్రం ఐదు గంటలకు కారులో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మధ్యలో వాగులు దాటేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో.. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు సోమిరెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు.
* పూర్వాశ్రమంలో స్నేహంతో
అయితే దారి పొడవునా తన పాత మిత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సాయం చేశారు. సోమిరెడ్డి సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. అయితే తెలంగాణలో సోమిరెడ్డి సహచరులుగా ఎర్రబెల్లి దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు ఉండేవారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో వారంతా టిడిపిని వీడారు. కానీ వారి మధ్య స్నేహం మాత్రం కొనసాగుతోంది. వరదల కారణంగా చిక్కుకున్న తమ స్నేహితుడికి.. తెలంగాణ మిత్రులు అలా సాయం చేశారన్నమాట.