Microsoft Service Outage: కుప్పకూలిన ‘మైక్రోసాఫ్ట్‌’.. ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, మీడియా సేవలకు అంతరాయం

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో విమాన సేవల నుండి సూపర్‌ మార్కెట్, బ్యాంకింగ్, పోర్టులు, మీడియాతోపాటు అనేక ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ అంతరాయం వల్ల మన దేశంలో మూడు ఎయిర్‌ క్యారియర్లు.. ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌ సంస్థలు బుకింగ్, చెక్‌–ఇన్, ఫ్లైట్‌ అప్‌డేట్‌లలో సమస్యలు ఎదురుకుంటున్నట్లు ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాయి.

Written By: Raj Shekar, Updated On : July 19, 2024 2:30 pm

Microsoft Service Outage

Follow us on

Microsoft Service Outage: యుఎస్‌ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్, అమెరికన్‌ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్‌స్ట్రైక్, మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ప్రపంచ వ్యాప్తంగా క్రాష్‌ అయింది. దీంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్‌ అవుతూ బ్లూ స్క్రీన్‌ ఎర్రర్‌ వస్తోంది. దీని కారణంగా ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, మీడియా సేవలు స్తంభించిపోతున్నాయి. లక్షలాది మంది మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ వినియోగదారులు ‘బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌‘ లోపాన్ని ఎదుర్కొంటున్నారు, దీని వలన వారి కంప్యూటర్‌లు షట్‌ డౌన్, రీస్టార్ట్‌ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఓకేసారి కాకుండా ఒకో దేశంలో ఒక్కో సమయంలో అంతరాయం కలుగుతోంది. దీంతో విండోస్‌ పనిచేయడం లేదని సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం(జూలై 19) నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య కారణంగా అమెరికాతోపాటు వివిధ దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి.

ఎమర్జెన్సీ సర్వీస్‌లకు అంతరాయం..
మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో విమాన సేవల నుండి సూపర్‌ మార్కెట్, బ్యాంకింగ్, పోర్టులు, మీడియాతోపాటు అనేక ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ అంతరాయం వల్ల మన దేశంలో మూడు ఎయిర్‌ క్యారియర్లు.. ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌ సంస్థలు బుకింగ్, చెక్‌–ఇన్, ఫ్లైట్‌ అప్‌డేట్‌లలో సమస్యలు ఎదురుకుంటున్నట్లు ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాయి.

స్పందించిన మైక్రోసాఫ్ట్‌..
తాజాగా తలెత్తిన సమస్యపై మైక్రోసాఫ్ట్‌ స్పందించింది. ‘మేము ప్రస్తుతం విమాన అంతరాయాలపై నవీకరణలను అందించడంలో సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యను పరిష్కరించడానికి మా బృందం చురుకుగా పని చేస్తోంది. ఏదైనా అసౌకర్యానికి చింతిస్తున్నాము, సమస్య పరిష్కరించబడిన తర్వాత మీకు తెలియజేస్తాము. మీ సహనానికి, సహ–సహకతకు ధన్యవాదాలు’ అని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది.

సమస్య ఇదీ…
మైక్రోసాఫ్ట్‌ ప్రాథమిక మూల కారణం దాని అజూర్‌ బ్యాకెండ్‌ వర్క్‌లోడ్‌లో ఒక భాగంలో ‘కాన్ఫిగరేషన్‌ మార్పు‘ అని తెలిపింది. దీని ఫలితంగా కనెక్టివిటీ వైఫల్యాలు ఈ కనెక్షన్‌లపై ఆధారపడిన దిగువ మైక్రోసాఫ్ట్‌ 365 సేవలను ప్రభావితం చేశాయని కంపెనీ తెలిపింది. సమస్య పరిష్కారానికి చర్యలను కొనసాగిçస్తున్నామని తెలిపింది. సమస్య పరిష్కారం అవుతుందని మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది.

హ్యాకింగ్‌ ఆరోపణలు..
ఇదిలా ఉంటే.. మైక్రోసాఫ్ట్‌ క్రాష్‌పై హ్యాకింగ్‌ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైనా సమస్య తలెత్తితో ఒక దేశంలో సేవలు నిలిచిపోతాయి. కానా ప్రపంచ వ్యాప్తంగా దశలవారీగా సేవలు నిలిచిపోవడం చూస్తుంటే మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన సేవలు నిలిచిపోవడం, ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో అంతరాయం కలగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా టికెట్‌ బుకింగ్‌ సేవలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10కు సంబంధించిన సేవలకు ప్రధానంగా అంతరాయం కలుగుతోంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో స్టాక్‌ మార్కెట్లపైనా ప్రభావం పడింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఆస్ట్రేలియా అత్యవసర సమావేశం..
విమాన, బ్యాంకింగ్, స్టాక్‌ మార్కెట్లతోపాటు పలు రంగాల్లో కలిగిన అంతరాయంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టింది. సేవలు నిలిచిపోవడానికి కారణాలు, హ్యాకింగ్‌పై చర్చలు జరిపింది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది. వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి రాకుండా చూడాలని ఆదేశించింది.