Mahindra to launch new Nu platform: థార్, బొలెరో వంటి పవర్ ఫుల్ కార్లను తయారు చేసే ఇండియా కంపెనీ మహీంద్రా కంపెనీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే, ఈసారి ఏదో కొత్త కారు లాంచ్ చేస్తుందన్న వార్త కాదు.. అంతకు మించి పెద్ద ప్లాన్‌తో వస్తోంది. భవిష్యత్తులో రాబోయే కొత్త కార్లన్నింటినీ తయారు చేయడానికి ఉపయోగపడే ఒక కొత్త ప్లాట్‌ఫామ్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆగస్టు 15న ముంబైలో ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారట. ప్రస్తుతం దీన్ని NFA (New Flexible Architecture) అని పిలుస్తున్నారు. అసలు దీని స్పెషల్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
మహీంద్రా కంపెనీ ఇటీవల ఒక టీజర్ రిలీజ్ చేసింది. అందులో Freedom NU అనే మాటను వాడారు. దీన్ని బట్టి చూస్తే ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌కు ఫ్రీడం ఎన్.యు. అనే పేరే పెట్టే అవకాశం ఉందని అర్థమవుతోంది. అంతేకాదు, ఆ టీజర్‌లో Freedom gets a NU expression this Independence Day(స్వాతంత్ర్య దినోత్సవం నాడు స్వేచ్ఛకు కొత్త రూపం) అని కూడా రాసుకొచ్చారు. అంటే, ఆగస్టు 15న మహీంద్రా ఏదో కొత్త పెద్ద మార్పును తీసుకురాబోతోందని స్పష్టమవుతోంది. ఇది భారత ఆటో ఇండస్ట్రీలో ఒక పెద్ద విప్లవమే అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Freedom gets a expression this Independence Day as we showcase a Bold vision for the future. #FREEDOM_NU#MahindraAuto #MahindraElectricOriginSUVs pic.twitter.com/FFMeY4CDTX
— Mahindra Automotive (@Mahindra_Auto) June 26, 2025
మహీంద్రా ఆటోమోటివ్ ఈ టీజర్‌ను రిలీజ్ చేసింది. సాధారణంగా మహీంద్రా అంటే పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కార్లు గుర్తుకొస్తాయి. కానీ, ఈ టీజర్‌లో మహీంద్రా ఎలక్ట్రిక్ ఒరిజిన్ ఎస్‌యూవీ లోగో, హ్యాష్‌ట్యాగ్ కూడా చూపించారు. దీన్ని బట్టి చూస్తే ఈ కొత్త ప్లాట్‌ఫామ్ అనేది కేవలం పెట్రోల్, డీజిల్ కార్లకే కాదు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల తయారీకి కూడా సపోర్ట్ చేస్తుందని స్పష్టమైంది. అంటే, ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని రకాల ఇంజిన్ ఆప్షన్లతో కార్లను తయారు చేయొచ్చన్నమాట. దీన్నే మల్టీ-పవర్‌ట్రెయిన్ ఆర్కిటెక్చర్ అంటారు.
ఈ కొత్త NFA ప్లాట్‌ఫామ్‌పై భవిష్యత్తులో చాలా కార్లు తయారయ్యే అవకాశం ఉంది. ఇటీవల టెస్టింగ్ చేస్తున్నప్పుడు కనిపించిన కొత్త బొలెరో కూడా బహుశా ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉండొచ్చని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంతేకాదు, థార్ స్పోర్ట్ లేదా అర్బన్ థార్ అనే కొత్త థార్ వేరియంట్లు కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ మహీంద్రాకు భవిష్యత్తులో కార్ల తయారీలో చాలా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. తక్కువ ఖర్చుతో, వేగంగా కొత్త మోడళ్లను, వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆగస్టు 15న మహీంద్రా ఎలాంటి నూ ఎక్స్‌ప్రెషన్‌తో వస్తుందో చూడాలి.