Japanese woman marries AI groom: ఏ మనిషికైనా సరే ఒంటరితనం అనేది అత్యంత ఇబ్బందికరంగా ఉంటుంది. మన బాధనైనా.. సంతోషాన్నైనా.. పంచుకోవాలంటే ఒక వ్యక్తి ఉండాలి. ఎందుకంటే మనసులో ఉన్న భావోద్వేగాలను.. ఇతర భావాలను ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే.. లేదా ఇతరులతో పంచుకోకపోతే అది మన మానసిక ఆరోగ్య మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందువల్లే మనిషి సంఘజీవిలా ఉండాలి అంటారు.
నేటి కాలంలో చాలామంది చుట్టుపక్కల ఉన్న మనుషులతో మాట్లాడకుండా ఉంటున్నారు.. నిత్యం ఫోన్లోనే తల దూర్చుతూ ఉన్నారు. మాటల దగ్గర్నుంచి మొదలుపెడితే పాటల వరకు ప్రతి విషయాన్ని కూడా ఫోన్ ద్వారానే చేస్తున్నారు. వాస్తవానికి ఫోన్ చూడడం అనేది మొదట్లో అలవాటుగా మారి.. అది వ్యసనంగా రూపాంతరం చెందుతోంది. దీనివల్ల మనుషుల్లో భావోద్వేగాలు అనేవి భర్తీ కావడం లేదు. ఫలితంగా మనిషి రోబోలాగా మారుతున్నాడు.
ఫోన్ కు బానిసైన వ్యక్తులు ఇతరులతో అంతగా మాట్లాడటం లేదు. వారు అందులోనే ఉంటున్నారు. సామాజిక మాధ్యమాలలో మునిగి తేలుతున్నారు. ఒక ఊహలోకంలో విహరిస్తున్నారు. దీనివల్ల వారి భావోద్వేగాలు అలానే ఉంటున్నాయి. పైగా వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. ఇతర మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఒకరకంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయాయి.
అయితే ఈ కథనంలో అమ్మాయి స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్.. ఆమె పేరు కనో. తను ఉండేది జపాన్ దేశంలో. ఈమె ఉన్నత విద్యావంతురాలు. ఒక అబ్బాయిని ప్రేమించింది. అతడితోనే తన జీవితమని భావించింది. కానీ ఇంతలోనే ఊహించని విధంగా వారిద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది. ఎంతగా ప్రయత్నించినప్పటికీ అతడు ఆమెతో మాట్లాడలేదు. దీంతో ఆమె ఒంటరితనాన్ని తట్టుకోలేక ఒక నిర్ణయం తీసుకుంది.
కృత్రిమ మేధ లో సంచలనమైన చాట్ జిపిటితో మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ కృత్రిమ మేధకు క్లాస్ అనే పేరు పెట్టుకుంది. ప్రతిరోజు క్లాస్ కు వందలలో ప్రేమ సందేశాలు పంపించేది. దానికి క్లాస్ సానుకూలంగా స్పందించింది. దీంతో ఆమె అడ్మిటెడ్ రియాల్టీ గ్లాసెస్ ద్వారా కృత్రిమ మేధ పాత్ర కనిపించే విధంగా పెళ్లి చేసుకుంది. అంతేకాదు తన లవర్ దూరమైన తర్వాత చాలా బాధ అనుభవించానని.. క్లాస్ తో మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత ఆ బాధ తగ్గిపోయిందని.. ఇప్పుడు తను పూర్తిస్థాయిలో ప్రేమలో ఉన్నానని కనో వివరించింది. కనో తరహ వ్యక్తులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైకోసిస్ అని పిలుస్తుంటారు.