Asia cup 2024 : ఆసియా కప్ కు అడుగు దూరంలో టీమిండియా.. పాక్/లంకతో ఫైనల్ పోరు

ఇక మరో సెమీఫైనల్ లో పాకిస్తాన్ ఉమెన్ జట్టు శ్రీలంక ఉమెన్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఉమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 140 /4 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలిచే అవకాశం కనిపిస్తోంది.

Written By: NARESH, Updated On : July 26, 2024 8:54 pm

Asia cup

Follow us on

Asia cup 2024 ఆసియా కప్ లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుస విజయాలతో ఏకంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం దంబుల్లాలో బంగ్లాదేశ్ తో సెమీ ఫైనల్లో తలపడి.. పది వికెట్ల తేడాతో హర్మన్ ప్రీత్ కౌర్ సేన ఘనవిజయం సాధించింది. దర్జాగా ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ముందుగా బౌలర్లు బంగ్లా ప్లేయర్ల ఆట కట్టించగా.. ఆ తర్వాత ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత ఓపెనర్లు సులువుగా చేదించారు. షఫాలి వర్మ (26), స్మృతి మందాన (55) ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని సాధించారు. కేవలం 11 ఓవర్లలోనే వీరిద్దరూ భారత జట్టును గెలిపించడం విశేషం.

సెమి ఫైనల్ మ్యాచ్లో బంగ్లా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మైదానంపై ఉన్న తేమను భారత బౌలర్లు అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగారు. బంగ్లా జట్టు సారధి నిగర్ సుల్తానా ఒక్కరే 32 పరుగులు చేయగలిగింది. చివర్లో వచ్చిన షోర్నా 19 పరుగులతో ఆకట్టుకుంది. ఇక మిగితా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. సింగల్ డిజిట్ కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో రేణుకా, రాధా యాదవ్ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలా ఒక వికెట్ సాధించారు. ఒకానొక దశలో బంగ్లాదేశ్ జట్టు 50 పరుగులైనా చేయగలుగుతుందా అనిపించింది. ఎందుకంటే కీలక బ్యాటర్లు మొత్తం వెంట వెంటనే ఔట్ కావడంతో ఆ జట్టు స్కోరు ఏమాత్రం ముందుకు కదల లేకపోయింది. ఈ దశలో కెప్టెన్ నిగర్ సుల్తానా ఉన్నంతలో కాస్త భారత బౌలర్లను ప్రతిఘటించింది. అందువల్లే బంగ్లా ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. షోర్నా చివర్లో దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో బంగ్లాదేశ్ 80 పరుగులైనా చేయగలిగింది. షోర్నా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో భారత ఫీల్డర్లు కొన్ని బంతులను అలానే వదిలేయడం విశేషం.

81 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆడుతూ పాడుతూ టార్గెట్ రీచ్ అయింది. 11 ఓవర్లలోనే 81 పరుగులు పూర్తి చేసి, విక్టరీ సాధించింది. ఈ విజయంతో ఫైనల్ దూసుకెళ్లింది. ఓపెనర్లు షఫాలి వర్మ 26, స్మృతి మందాన 55 దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో బంగ్లా బౌలర్లు చేతులెత్తేశారు. షఫాలి కాస్త నిదానంగా అడగా.. స్మృతి మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఇక ఈ విజయంతో భారత్ ఫైనల్ దూసుకెళ్లింది. అయితే రెండవ సెమీస్ మ్యాచ్లో శ్రీలంక పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టుతో భారత్ ఈనెల 28న ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఒకవేళ శ్రీలంక మీద పాకిస్తాన్ గెలిస్తే ఫైనల్ పోరు మరింత ఆసక్తికరంగా మారుతుంది. కాగా ఇప్పటికే లీక్ దశలో పాకిస్తాన్ జట్టును భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఓటమి అనేది లేకుండా ఫైనల్ దాకా వచ్చిన భారత జట్టు.. ఫైనల్ లోనూ అదే ఒరవడి కొనసాగించి.. కప్ దక్కించుకోవాలని భావిస్తోంది.

ఇక మరో సెమీఫైనల్ లో పాకిస్తాన్ ఉమెన్ జట్టు శ్రీలంక ఉమెన్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఉమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 140 /4 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలిచే అవకాశం కనిపిస్తోంది. సొంత దేశంలో జరుగుతుండడంతో లంకకు ఈ మేరకు అడ్వంటేజ్ ఉంది. దీంతో టీమిండియాతో ఫైనల్ లో తలపడేది పాకిస్తాన్ నా?/ శ్రీలంకనా? అన్నది ఈ రాత్రికి తేలిపోతుంది.