Zayad International Airport : బస్టాండ్ లోకి వెళ్లాలంటే ఎటువంటి టికెట్ అవసరం లేదు. రైల్వే స్టేషన్ వెళ్లాలంటే ప్లాట్ఫారం టికెట్ తీసుకోవాలి. అదే విమానాశ్రయంలోకి ప్రవేశించాలంటే కచ్చితంగా పాస్పోర్ట్ లేదా ఐడి కార్డు చూపించాల్సిందే.. మన దేశమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ నిబంధన కచ్చితంగా అమలు చేస్తారు.. ఎందుకంటే విమానాశ్రయాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. పైగా అత్యంత సున్నితమైన ప్రాంతాలు కాబట్టి అడుగునా తనిఖీలు చేస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల లగేజీని ఆసాంతం పరిశీలిస్తారు. ఏమాత్రం తేడా అనిపించినా ఎక్కడికక్కడ చెక్ చేస్తారు. అందుకే విమానాశ్రయంలోకి ప్రవేశించే ప్రయాణికులు తప్పనిసరిగా పాస్పోర్ట్, ఐడి కార్డును తీసుకెళ్తారు. అందులో ఏమైనా తేడాలు ఉంటే వెంటనే సరి చూసుకుంటారు. అయితే మారిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో సరికొత్త వెసలు బాటును అబుదాబిలోని షేక్ జాయేద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నిర్వాహకులు ప్రయాణికుల కోసం తీసుకొచ్చారు. ఇంతకీ ఆ వెసలు బాటు ఏంటంటే..
విదేశాలకు వెళ్లాలంటే
చాలామంది విదేశాలకు వెళ్లే సమయంలో కచ్చితంగా పాస్పోర్ట్ వెంట ఉండాలి. అది అత్యంత ముఖ్యం కూడా. విమానం ఎక్కే సమయంలో తనిఖీ కేంద్రం వద్ద పాస్పోర్ట్ పత్రాలను పరిశీలిస్తారు. దానికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో అబుదాబి లోని షేక్ జాయేద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం (zayad international airport) అద్భుతమైన టెక్నాలజీని అమల్లోకి తీసుకురానుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముఖ కవళికలను పసికట్టగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టనుంది.
ఈ టెక్నాలజీ ద్వారా ప్రయాణికులకు సరికొత్త సేవలు అందుతాయి. ఇది అందుబాటులోకి వస్తే పాస్పోర్ట్ అవసరం ఉండదు. ఐడి కార్డు వెంట తీసుకురావాల్సిన పని ఉండదు. ప్రయాణికులు ప్రయాణానికి ముందు విమానాశ్రయం చేరుకొని.. తమకు కేటాయించిన ప్రాంతంలో నిలబడి సెక్యూరిటీ గేటు వద్ద పత్రాలను తనిఖీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి బదులుగా ఫేషియల్ స్కానర్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. దీనివల్ల విలువైన సమయం ఆదా అవుతుంది. ఇది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇది గనక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఫేషియల్ ఫ్యూచర్స్టిక్ టెక్నాలజీ ఉపయోగించిన తొలి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గా జాయేద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నిలుస్తుంది.
యునైటెడ్ అరబ్ ఎమైరేట్స్ లోని చాలా ప్రాంతాలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచరిస్టిక్ ఫ్లైట్ హబ్ లలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని విమానాశ్రయంలోని లాంజ్, డ్యూటీ ప్రీ షాప్, బోర్డింగ్ గేట్ల వద్ద ఏర్పాటు చేయనున్నారు..”ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రయాణికులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది. అయితే ప్రయాణికులు విమానాశ్రయంలో ప్రవేశించే ముందు ముందస్తుగా ఎలాంటి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. విమానాశ్రయంలోకి ప్రయాణికులు వెళ్లిన వెంటనే యధావిధిగా వారి ఫేస్ స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. వారు ప్రశాంతంగా లాంజ్ లో కూర్చోవచ్చు. తమకు నచ్చిన ఫుడ్ తినవచ్చు. షాపింగ్ చేసుకోవచ్చు. పుస్తకాలు చదువుకోవచ్చు. ఈ ప్రక్రియ వల్ల రిటైల్ ఏరియా లేదా గేటు వద్దకు వెళ్లడానికి కేవలం 10 నుంచి 12 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని” జాయేద్ విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు. ఇది ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల విలువైన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వారు వివరిస్తున్నారు.