Smartphone Hanging Problem: ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్‌ఫోన్ కీలకంగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కువ సమయం ఫోన్ తోనే గడిపేవారు చాలా మందే ఉన్నాయి. వివిధ అవసరాల నిమిత్తం స్మార్ట్ ఫోన్ వాడకం రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే కొంతకాలం ఈ మొబైల్ ఉపయోగించిన తర్వాత స్లో అవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు ఫోన్ స్లో కావడానికి కారణాలేంటి? స్పీడ్ పెంచుకోవాడనికి ఏం చేయాలి?
హెవీ స్టోరేజ్:
ఫోన్ స్లో అవడానికి ప్రధాన కారణం స్టోరేజ్ నిండిపోవడం. ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు, యాప్స్, డౌన్‌లోడ్స్ ఎక్కువగా నిల్వ చేస్తే, అంతర్గత మెమరీపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కొత్త డేటాను ప్రాసెస్ చేయడానికి ఫోన్‌కు సమయం పడుతుంది. ఫలితంగా యాప్స్ ఓపెన్ అవ్వడానికి ఆలస్యం అవుతుంది, ఫోన్ హ్యాంగ్ అవుతుంది.
యాప్స్ లోడ్:
ఎక్కువ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉంచడం. మనం వాడకపోయినా కొన్ని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూనే ఉంటాయి. ఇవి RAMను వినియోగించి ఫోన్ పనితీరును తగ్గిస్తాయి. ముఖ్యంగా గేమ్స్, సోషల్ మీడియా యాప్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.
క్యాచ్ డేటా:
క్యాష్ డేటా పెరగడం. ప్రతి యాప్ తన పనితీరును వేగంగా చేయడానికి తాత్కాలిక డేటాను స్టోర్ చేస్తుంది. ఈ క్యాష్ ఫైళ్లు కాలక్రమేణా ఎక్కువ అవుతాయి. అవి క్లియర్ చేయకపోతే ఫోన్ మెమరీని ఆక్రమించి పనితీరును మందగింపజేస్తాయి.
సాప్ట్ వేర్ అప్డేట్:
సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయకపోవడం. ఫోన్ తయారీదారులు తరచుగా కొత్త అప్డేట్స్ విడుదల చేస్తారు. ఇవి బగ్స్‌ను సరిచేసి, పనితీరును మెరుగుపరుస్తాయి. కానీ చాలామంది ఈ అప్డేట్స్‌ను పట్టించుకోరు. దాంతో పాత సాఫ్ట్‌వేర్ వల్ల ఫోన్ స్లో అవుతుంది.
అలాగే, వైరస్‌లు లేదా మాల్వేర్ కూడా ఫోన్ స్పీడ్ తగ్గడానికి కారణమవుతాయి. అనుమానాస్పద వెబ్‌సైట్ల నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేయడం లేదా అపరిచిత లింక్స్‌పై క్లిక్ చేయడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. ఇవి ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసి పనితీరును ప్రభావితం చేస్తాయి. ఫోన్ వేడెక్కడం (ఓవర్‌హీటింగ్) .. ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, చార్జింగ్ సమయంలో ఫోన్ వాడటం, లేదా ఎండలో ఎక్కువసేపు ఉంచడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. ఈ సమయంలో ప్రాసెసర్ స్పీడ్ తగ్గిపోవడం వల్ల ఫోన్ స్లోగా పనిచేస్తుంది.
ఫోన్ స్పీడ్ పెంచుకోవాలంటే..
ఫోన్ స్పీడ్ పెరగాలంటే ముందుగా స్టోరేజ్‌ను ఖాళీ చేయాలి. అవసరం లేని ఫోటోలు, వీడియోలు, ఫైల్స్‌ను తొలగించాలి. కనీసం 20 నుంచి 30 శాతం వరకు స్టోరేజ్ ఖాళీగా ఉంచితే ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది. వాడని యాప్స్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. ఇది RAM మరియు స్టోరేజ్ రెండింటినీ సేవ్ చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసే యాప్స్‌ను కూడా క్రమం తప్పకుండా క్లోజ్ చేయడం మంచిది.క్యాష్ డేటాను తరచూ క్లియర్ చేయడం కూడా ఫోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ క్యాష్‌ను క్లియర్ చేయవచ్చు. ఇది చిన్న మార్పే అయినా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కూడా తప్పనిసరి. తాజా అప్డేట్స్ ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్ పనితీరు మెరుగుపడటమే కాకుండా, భద్రత కూడా పెరుగుతుంది. లైట్ వెర్షన్ యాప్స్ ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. ఇవి తక్కువ RAM, డేటా వినియోగిస్తాయి. అందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది.ఫోన్‌ను తరచూ రీస్టార్ట్ చేయడం వల్ల కూడా పనితీరు మెరుగుపడుతుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న అనవసర ప్రాసెస్‌లను నిలిపివేస్తుంది.అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫోన్ స్లోగా ఉంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఒక పరిష్కారం. అయితే ముందుగా డేటాను బ్యాకప్ తీసుకోవడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల ఫోన్ కొత్తదిలా వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుంది.