https://oktelugu.com/

AI Dress: మెడలో పాములు.. ఒంటికి మెడుసా డ్రెస్.. ఇదేంటి బాబోయ్ ఇలా ఉంది..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పటివరకు కొన్ని రకాలైన సాంకేతికతలే మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగ విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 3, 2024 / 03:58 PM IST

    AI Dress

    Follow us on

    AI Dress: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ విప్లవాత్మక మార్పులకు గురవుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలతో రకరకాల పుంతలు తొక్కుతోంది. ఫలితంగా మనిషి జీవితం అత్యంత సుఖవంతమవుతోంది. ఫలితంగా యావత్ ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు తీస్తోంది. దాని చుట్టే పరిభ్రమిస్తోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఒక ఊపు ఊపుతోంది. ఇందులో రకరకాల ఆవిష్కరణలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పటివరకు కొన్ని రకాలైన సాంకేతికతలే మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగ విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో గూగుల్ సంస్థలో పనిచేసే ఇంజనీర్ ఇంజనీర్ క్రిస్టినా ఎర్నెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఓ డ్రెస్ రూపొందించారు. She builds robots.org అనే సంస్థను క్రిస్టినా ఏర్పాటు చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా బాలికలకు రోబోల తయారీపై ఆమె అవగాహన కల్పిస్తుంది.

    క్రిస్టినాకు శాస్త్ర సాంకేతిక రంగాలపై విపరీతమైన పట్టు ఉంది. ఈమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో డ్రస్ రూపొందించింది. వాటికి రోబోటిక్ విధానంలో పాములను జోడించింది. దీనికి మెడుసా డ్రెస్ అని పేరు పెట్టింది. అంతేకాదు ఆమె రూపొందించిన డెస్సును వేసుకొని చూపించింది. ఆమె మెడ చుట్టూ పెద్ద రోబోటిక్ పాములు నిజ జీవితంలో సర్పం లాగే ఉన్నాయి. ఆమె నడుము చుట్టూ కూడా మూడు బంగారు రంగు పాములు ఉన్నాయి. ఈ రోబోటిక్ స్నేక్ డ్రెస్ ద్వారా ముఖాలను సులభంగా గుర్తించవచ్చట. దీని ద్వారా ఎవరైనా వ్యక్తి క్రిస్టినా వైపు చూస్తే.. పాము వెంటనే తలతిప్పి చూసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కోడింగ్ చేసింది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో రూపొందించిన తొలి డ్రెస్ ఇదే అని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.

    ఈ డ్రెస్ రూపొందించేందుకు క్రిస్టినా అనేక ప్రయోగాలు చేసింది. ఇందులో అనేకసార్లు విఫలమైంది కూడా. దానికి సంబంధించిన వీడియోను కూడా సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేసింది. ఈ వీడియోకు ఏకంగా లక్షకు పైగా లైక్స్ దక్కాయి. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. క్రిస్టినా పేరుకు ఇంజనీర్ అయినప్పటికీ.. ఫ్యాషన్ రంగంపై ఆమెకు విపరీతమైన ఆసక్తి ఉంది. అందువల్లే ఈ ప్రాజెక్టు రూపొందించినట్టు తెలుస్తోంది. ఆ డ్రెస్ రూపొందించేందుకు చాలా సమయాన్ని వెచ్చించింది. భారీగా నగదు కూడా ఖర్చు చేసింది. ఈ డ్రెస్ ను రూపొందించిన నేపథ్యంలో క్రిస్టినా పై చాలామంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.