Flight Mode Benefits: స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ‘ఫ్లైట్ మోడ్’ (Flight Mode) అనే ఆప్షన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిని కేవలం విమాన ప్రయాణాల్లో మాత్రమే ఉపయోగించే ఫీచర్‌గా అని అనుకుంటారు. కానీ దీనితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొబైల్ సిగ్నల్, వై-ఫై, బ్లూటూత్ వంటి వైర్‌లెస్ కనెక్షన్లను తాత్కాలికంగా ఆఫ్ చేసే ఈ ఫీచర్, రోజువారీ జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. సరైన విధంగా వాడితే బ్యాటరీ సేవ్ చేయడం నుంచి ప్రశాంతమైన నిద్ర వరకు అనేక లాభాలు పొందొచ్చు. ఆ వివరాల్లోకి వెళితె..
బ్యాటరీ వినియోగం తక్కువ:
ఫోన్‌లో నెట్‌వర్క్ సిగ్నల్స్ కోసం నిరంతరం సెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ ఎక్కువ పవర్ వినియోగిస్తుంది. ఇలాంటి సమయంలో ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే ఫోన్ అన్ని వైర్‌లెస్ కనెక్షన్లను నిలిపివేస్తుంది. దీంతో బ్యాటరీ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణాల్లో లేదా చార్జింగ్ సౌకర్యం లేని సమయంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది రాత్రిపూట ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి పడుకుంటే ఉదయం వరకు బ్యాటరీ శాతం ఎక్కువగా మిగులుతుందని చెబుతున్నారు.
వేగంగా ఛార్జింగ్:
ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ యాక్టివిటీ కొనసాగుతూనే ఉంటాయి. ఇవి బ్యాటరీని వినియోగిస్తుండటంతో ఛార్జింగ్ స్పీడ్ తగ్గుతుంది. అయితే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఛార్జ్ చేస్తే అన్ని నెట్‌వర్క్ కార్యకలాపాలు ఆగిపోతాయి. దీంతో బ్యాటరీకి నేరుగా పవర్ చేరి సాధారణం కంటే వేగంగా ఛార్జ్ అవుతుంది. అత్యవసర సమయంలో తక్కువ టైమ్‌లో ఎక్కువ బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది మంచి ట్రిక్‌గా పనిచేస్తుంది.
రాత్రిపూట ఆన్ చేస్తే..
రాత్రిపూట ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోయే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే అర్థరాత్రి వచ్చే కాల్స్, నోటిఫికేషన్లు, మెసేజ్ అలర్ట్స్ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే ఈ డిస్టర్బెన్స్ పూర్తిగా తగ్గిపోతుంది. అలారమ్ మాత్రం పనిచేస్తుంది. కాబట్టి ఉదయం లేవడంలో ఇబ్బంది ఉండదు. దీంతో ఫోన్ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పొందే అవకాశం ఉంటుంది.
పిల్లల విషయంలో..
చిన్నపిల్లలకు వీడియోలు లేదా గేమ్స్ కోసం ఫోన్ ఇస్తుంటారు. కానీ ఇంటర్నెట్ ఆన్‌లో ఉంటే అనవసర యాప్స్ ఓపెన్ కావడం, ప్రకటనలు రావడం లేదా తెలియని లింక్స్‌పై క్లిక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఫోన్ ఇస్తే ఇంటర్నెట్ పూర్తిగా ఆఫ్ అవుతుంది. దీంతో పిల్లలు సురక్షితంగా ఆఫ్‌లైన్ గేమ్స్ లేదా ముందుగా డౌన్‌లోడ్ చేసిన వీడియోలు మాత్రమే చూడగలుగుతారు. ఇది పేరెంట్స్‌కు కూడా కొంత భరోసా ఇస్తుంది.
కొన్ని సెకన్లపాటు ఆన్ చేస్తే..
కొన్నిసార్లు ఫోన్‌లో సిగ్నల్ సరిగా రావడం లేదు, కాల్స్ కనెక్ట్ కావడం లేదు లేదా ఇంటర్నెట్ పనిచేయడం లేదు అనే సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో ఫోన్ రీస్టార్ట్ చేయకుండా ఫ్లైట్ మోడ్‌ను కొన్ని సెకన్లు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తే నెట్‌వర్క్ రిఫ్రెష్ అవుతుంది. దీంతో చాలాసార్లు సిగ్నల్ సమస్యలు వెంటనే సెట్ అవుతాయి. ఇది చిన్న ట్రిక్ అయినా చాలా మందికి ఉపయోగపడుతుంది.
జర్నీ చేసేటప్పుడు..
విమానాల్లో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో ఫ్లైట్ మోడ్ ఉపయోగించాలని సూచిస్తారు. అయితే బస్సు, రైలు ప్రయాణాల్లో కూడా నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువ బ్యాటరీ ఖర్చు చేస్తుంది. ఇలాంటి సమయంలో ఫ్లైట్ మోడ్ వాడితే బ్యాటరీ ఎక్కువసేపు నిలుస్తుంది. అంతేకాకుండా ఫోన్ వల్ల వచ్చే డిస్ట్రాక్షన్స్ తగ్గి ప్రశాంతంగా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
