Phone Tapping: మీ ఫోన్ ట్యాప్ కు గురైతే ఇలా చేయండి

ఫోన్ ట్యాప్ అయినట్టు సందేహం వస్తే వెంటనే అలెర్ట్ కావాలి. ఎందుకంటే గోప్యత అనేది ఏ మనిషికైనా అవసరం. భద్రతను కాపాడుకోవడం తప్పనిసరి. మనం వాడుతున్న ఫోన్ ను జాగ్రత్తగా గమనించాలి.

Written By: Anabothula Bhaskar, Updated On : April 21, 2024 8:36 am

Phone Tapping

Follow us on

Phone Tapping: అరచేతిలో ఇమిడిపోయే ఒక ఫోన్.. మన జీవితాన్ని నిర్దేశిస్తోంది. మనం ఏం తింటున్నామో, ఏం చూస్తున్నామో, ఎలాంటి వాటిని ఇష్టపడుతున్నామో, మరి కొద్ది సేపట్లో ఏం చేయబోతున్నామో.. ఇలా సమస్తం మొత్తం ఫోనే నిర్దేశిస్తోంది. ఇలాంటి సమయంలో మీ మీద ఎవరైనా కక్షతోనో.. లేక కోపంతోనో ఫోన్ ట్యాప్ చేస్తే ఇంకేమైనా ఉందా.. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఫోన్ ట్యాప్ గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల మీద గత అధికార ప్రభుత్వం విస్తృతంగా నిఘా పెట్టిందని.. వారు చేసే పనిని ముందే తెలుసుకొని ఇబ్బంది పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అలాంటి పరిస్థితి మీకే ఎదురైతే ఏం చేయాలో, దానికి పరిష్కార మార్గాలు ఏమిటో.. ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫోన్ ట్యాప్ అయినట్టు సందేహం వస్తే వెంటనే అలెర్ట్ కావాలి. ఎందుకంటే గోప్యత అనేది ఏ మనిషికైనా అవసరం. భద్రతను కాపాడుకోవడం తప్పనిసరి. మనం వాడుతున్న ఫోన్ ను జాగ్రత్తగా గమనించాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. తెలియని అప్లికేషన్లు ఏవైనా ఉంటే వెంటనే తొలగించాలి. సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవాలి. అందులో ఏమైనా తేడా ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. అనుమానిత లేదా ప్రమాదకరమైన నెట్వర్క్ కనెక్షన్లు ఉంటే రెండవ మాటకు తావు లేకుండా తొలగించాలి. ఫోన్ ఆపరేటింగ్ సిస్టం, సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అప్లికేషన్లను కూడా ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవాలి. వీటివల్ల ఏవైనా లోపాలు గనుక ఉంటే అవి వెంటనే సరిదిద్దుకుంటాయి. మన వాడే ఫోన్ ను ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ప్రమాదకరమైన నిఘా సాఫ్ట్ వేర్లు వెంటనే తొలగిపోతాయి. అయితే ఫోన్ రీసెట్ చేసుకునే ముందు ఒకసారి అందులో ఉన్న అవసరమైన సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవడం ఉత్తమం.

ఇవన్నీ చేసిన తర్వాత అత్యంత సమర్థవంతమైన, విశ్వసనీయమైన యాంటీవైరస్ లేదా యాంటీ స్పై వేర్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. ప్రమాదకరమైన ప్రోగ్రామ్స్ ను డిలీట్ చేయాలి. దీనివల్ల ఫైల్స్ కు సెక్యూరిటీ ఏర్పడుతుంది. అవి వ్యక్తిగత గోప్యతను కాపాడతాయి. అన్నింటికంటే ముఖ్యంగా భద్రమైన వైఫై నెట్వర్క్ వాడాలి. ప్రమాదకరమైన అన్ సెక్యూర్డ్, పబ్లిక్ వైఫై నెట్వర్క్ లతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ ను కనెక్ట్ చేయొద్దు. ఫోన్ పనితీరును ఎప్పటికప్పుడు గమనించాలి. డాటా వాడకం, నెట్వర్క్ కనెక్షన్, ఇన్ స్టాల్ చేసుకున్న యాప్స్ వంటి వాటిపై ఒక నిఘా పెట్టాలి. ఏమైనా తేడా అనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఇవన్నీ చేసిన తర్వాత.. ఏమైనా అనుమానం ఉంటే సైబర్ సెక్యూరిటీ నిపుణులను సంప్రదించాలి.