Yellowstone Earthquakes: ప్రపంచంలోనే యాక్టివ్ గా ఉండే అగ్నిపర్వతాల్లో ఒకటైన అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ కింద ఎవరూ చూడని భూకంపాలు చాలా ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని వాడి చేసిన కొత్త పరిశోధనలో గతంలో అనుకున్నదాని కంటే పది రెట్లు ఎక్కువ, అంటే సుమారు 86,000 భూకంపాలు ఉన్నట్లు తెలిసింది. 2008 నుంచి 2022 వరకు వచ్చిన భూకంపాల సమాచారాన్ని పరిశీలించి ఈ విషయాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. ఈ కొత్త అధ్యయనం వల్ల యెల్లోస్టోన్ అగ్నిపర్వతం కింద భూమిలో ఏం జరుగుతుందో మరింత అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల కాలంలో భూకంపాలను గుర్తించే పద్ధతిలో ఏఐ ఓ పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఇది పాత పద్ధతుల కంటే చాలా కచ్చితంగా, వేగంగా భూకంపాలను గుర్తిస్తుంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీలను ఉపయోగించి భూకంప తరంగాలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భూకంపాలను మరింత కచ్చితంగా, వెంటనే గుర్తించగలుగుతున్నారు. భూకంపాలను గుర్తించడంలో ఈక్యూట్రాన్సఫర్ అనే ఏఐ మోడల్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ కొత్త సిస్టమ్స్ వల్ల భూకంపం వచ్చిన కేవలం 4 సెకన్లలోనే అది ఎక్కడ వచ్చింది.. ఎంత తీవ్రతతో వచ్చిందో చెప్పేయొచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా భూకంపాలను మరింత కరెక్టుగా గుర్తించే పరికరాలను తయారు చేయవచ్చు.
యెల్లోస్టోన్‌లో వచ్చే భూకంపాల్లో దాదాపు సగం వరకు భూకంప సమూహాలు ఉంటాయి. అంటే, ఒకేసారి చిన్న ప్రాంతంలో తక్కువ సమయంలో ఎక్కువ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ సమూహాలలో పెద్ద భూకంపం చివరలో వస్తుంది.. అవి ఒక చోట నుండి ఇంకో చోటికి కదులుతున్నట్లు కనిపిస్తాయి. 2021 జూలైలో యెల్లోస్టోన్ సరస్సు కింద వచ్చిన భూకంప సమూహమే దీనికి ఉదాహరణ. రెండు వారాల్లో 657 భూకంపాలు వచ్చాయి.. అవి క్రమంగా ఆ ప్రాంత నుంచి ఇంకో ప్రాంతానికి విస్తరించాయి.
Also Read: The Birth of Earth: పుట్టినప్పుడు భూమి ఎలా ఉంది? అది మంచులో ఎలా గడ్డకట్టింది?
చాలా కాలం పరిశీలించిన తర్వాత పెద్ద భూకంప సమూహాలు ఒకదాని పక్కన ఒకటి వస్తాయని, కానీ వాటి మధ్య చాలా కాలం గ్యాప్ ఉంటుందని కనుగొన్నారు. భూమి లోపల నెమ్మదిగా కదిలే నీరు, అప్పుడప్పుడు వేగంగా ప్రవహించే ద్రవాలు దీనికి కారణమని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ ద్రవాలు అగ్నిపర్వతం కింద ఉన్న మాగ్మా నుండి వస్తాయి. వీటి కదలికల వల్లే యెల్లోస్టోన్‌లో భూకంప సమూహాలకు కారణమని శాస్త్రవేత్తలు వివరించారు.
యెల్లోస్టోన్ కింద ఉన్న అగ్నిపర్వత వ్యవస్థ ఇంతకు ముందు అనుకున్నదానికంటే చాలా క్లిష్టంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవలి ఫోటోల ద్వారా, భూమి లోపల మాగ్మా అనేక పొరలలో ఉందని తెలిసింది. పైన ఉన్న మాగ్మా చాంబర్ ఒక పెద్ద ఫ్రైయింగ్ పాన్ లా ఉంటుందట. ఇది భూమి ఉపరితలం నుంచి 3 నుంచి 9మైళ్ల లోతులో దాదాపు 19 నుండి 55 మైళ్ల విస్తీర్ణంలో ఉంది.
2023లో భూకంప శాస్త్రవేత్తలు 650 చిన్న సెన్సార్లను, కృత్రిమ భూకంపాలను సృష్టించే ట్రక్కును ఉపయోగించి, ఈ పై చాంబర్ సరిహద్దును భూమి లోపల 3.8 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఈ చాంబర్‌లో 86శాతం గట్టి రాళ్లు, 14శాతం ఖాళీ ప్రదేశం ఉంది. ఈ ఖాళీలో సగం కరిగిన పదార్థం, సగం ఆవిర్లు, ద్రవాలతో నిండి ఉంది. ఈ పై చాంబర్ కింద 2015లో అంతకంటే పెద్ద మాగ్మా రిజర్వాయర్ కనుగొన్నారు. ఇది ఉపరితలం పై నుంచి 28 మైళ్ల లోతులో ఉంది. పై చాంబర్ కంటే 4.4 రెట్లు పెద్దది. ఈ వ్యవస్థ ఎంత పెద్దదైనా, యెల్లోస్టోన్ అగ్నిపర్వతం విస్తరించడం లేదని, లేదా పేలే ప్రమాదం పెరగలేదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మనం ఇప్పుడు మంచి టెక్నాలజీతో భూమి లోపల ఉన్నదాన్ని మరింత స్పష్టంగా చూడగలుగుతున్నాం అంతే.