Ethanol Buses : కాలుష్యం భవిష్యత్‌లో దేశంలో అతిపెద్ద సమస్యగా మారబోతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ వాసులు కాలుష్యంతో వ్యాధులబారిన పడుతున్నారు. శీతాకాలంలో అయితే రోడ్డపై తిరగలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో మెట్రోపాలిటన్ సిటీలు అయిన ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణపై కేంద్రం దృష్టిసారించింది. ఈ క్రమంలోనే వాహన కాలుష్యం నియంత్రణకు ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. తాజాగా ప్రజారవాణా వాహనాలు కూడా కాలుష్య రహితంగా మార్చే యోచన చేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో భారత రోడ్లపైకి 132 సీట్ల బస్సులను తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఓ జాతీయ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వివరాలు వెల్లడించారు.
నాగపూర్‌లో పైలట్ ప్రాజెక్టు..
ప్రజారవాణా వాహనాలు కాలుష్య రహితంగా మార్చేందుకు నాగపూర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. కాలుష్యం ముప్పును ఎదుర్కొనేందుకు దిగుమతి ప్రత్యామ్నాయం, కాలుష్యరహిత ఇంధనం, స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చు వంటి పరిష్కార మార్గాలు అవసరమన్నారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో ఇథనాల్ పంపులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రూ.120 లీటరు పెట్రోల్‌కు ఖర్చుపెట్టే బదులు.. రూ.60తో ఇథనాల్ వాడొచ్చని తెలిపారు. దీంతో టికెట్ ధర 15 నుంచి 20 శాతం తగ్గుతుందని వెల్లడించారు.
నాగపూర్‌లో పైలట్ ప్రాజెక్టు..
తాను చెక్ రిపబ్లిక్ వెళ్లినప్పుడు అక్కడ మూడు బస్సులు కలిసి ఒకే ట్రాలీ బస్సుగా ఉండడం చూశానని తెలిపారు. ఇక్కడ కూడా టాటా సహకారంతో నాగపూర్‌లో ఓ పైలట్ ప్రాజెక్టు చేపట్టామన్నారు. మన ప్రాజెక్టులోనూ 132 మంది కూర్చునే విధంగా బస్సు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ బస్సులు 40 కిలోమీటర్లకు ఒకసారి చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కేవలం 40 సెకన్లలో చార్జింగ్ అవుతుందని, తర్వాత మళ్లీ 40 కి.మీ వెళ్లొచ్చని వెల్లడించారు. ఇందుకు కేవలం రూ.35 నుంచి రూ.40 వరకు ఖర్చవుతుందని తెలిపారు.
విమానం తరహా సౌకర్యాలు..
కొత్తగా అందుబాటులోకి వచ్చే 132 సీట్ బస్సుల్లో విమానం తరహాలో సౌకర్యాలు ఇంటాయని తెలిపారు. సీటింగ్, ఏసీ, సీటు ముందు ల్యాప్‌టాప్ పెట్టుకునే సౌలబ్యం ఉండాలని సూచించారు. ఎయిర్ హోస్టెస్ మాదిరిగా పండ్లు, ప్యాక్ చేచసిన ఆహారం, శీతల పానీయాలు అందించేందుకు బస్ హోస్టెస్ ఉంటారని తెలిపారు. డీజిల్ ఖర్చుతో పోలిస్తే దీని నిర్వహణ ఖర్చు 30 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో కాలుష్య రహిత సదుపాయాలు మెరుగుపర్చేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు.