https://oktelugu.com/

Zimbabwe vs India : టీమిండియా చేతిలో ఓడిపోయినప్పటికీ.. జింబాబ్వే సరికొత్త రికార్డు..

Zimbabwe vs India ఇక ఈ మ్యాచ్ లో జింబాబ్వే పై భారత్ గెలిచిన నేపథ్యంలో .. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ దక్కించుకున్నాడు. అతడు జింబాబ్వే జట్టులో ముగ్గురు కీలక ఆటగాళ్లను ఔట్ చేశాడు. ఒకే ఓవర్ లో సికిందర్ రజా, కాంప్ బెల్ ను ఔట్ చేసి, జింబాబ్వే జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత జింబాబ్వే జట్టు ఏ దశలోనూ భారత జట్టును ప్రతిఘటించలేకపోయింది.

Written By:
  • NARESH
  • , Updated On : July 10, 2024 / 10:43 PM IST

    Zimbabwe vs India

    Follow us on

    Zimbabwe vs India : ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో జింబాబ్వే భారత్ చేతిలో మరో ఓటమిని చవిచూసింది.. తొలి టి20 లో విజయం సాధించిన జింబాబ్వే జట్టు.. అదే ఊపును కొనసాగించలేకపోతోంది. రెండవ టి20 మ్యాచ్లో 100 పరుగుల తేడాతో ఓడిపోయిన జింబాబ్వే.. బుధవారం జరిగిన మూడో మ్యాచ్లో 23 పరుగుల తేడాతో మరో ఓటమిని చవిచూసింది. దీంతో 5 t20 మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తో వెనుకబడింది.

    బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడవ టి20 మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా.. 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ 66 పరుగులు చేసి టచ్ లోకి వచ్చాడు. రుతు రాజ్ గైక్వాడ్ 49 పరుగులు చేసి.. వెంట్రుక వాసిలో అర్థ సెంచరీ మిస్ చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ 36 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబని, సికిందర్ రజా చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

    అనంతరం 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి, ఆరు వికెట్లు కోల్పోయి, 159 పరుగులు చేసింది. ఆ జట్టులో మైర్స్ 43*, మదండే 37 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ మూడు, ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

    టీమిండియా ఇచ్చిన 183 రన్స్ టార్గెట్ చాలా పెద్దదే అయినప్పటికీ.. జింబాబ్వే జట్టు ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి దిగింది. అయితే జింబాబ్వే జట్టును అవేశ్ ఖాన్ ప్రారంభంలోనే చావు దెబ్బ తీశాడు.. మదే వెర్(1) ను క్యాచ్ అవుట్ ద్వారా పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో మారుమని(13) క్యాచ్ అవుట్ అయ్యాడు. బెన్నెట్(3) ను ఆవేష్ ఖాన్ ఔట్ చేశాడు. ఇదే క్రమంలో సికిందర్ రజా(15), క్యాంప్ బెల్ (1) ను వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్ లో అవుట్ చేశాడు. దీంతో జింబాబ్వే జట్టు నిండా 40 పరుగులు చేయకముందే ఐదు వికెట్లు కోల్పోయింది.

    ఈ దశలో వచ్చిన మైర్స్, మదండే ధాటిగా ఆడారు. ఆరో వికెట్ కు 77 పరుగులు జోడించారు. వాస్తవానికి జింబాబ్వే జట్టుకు ఇలా పతనం అంచులో నిలిచి.. తర్వాత తేరుకోవడం అలవాటే. 2024 హరారే వేదికగా(ప్రస్తుత టి20 సిరీస్లో) టీమిండియాతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఇలాగే వెంట వెంటనే ఐదు వికెట్లు కోల్పోయింది. చివరికి 119 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పై జింబాబ్వే గెలిచింది. 2022లో హరారే వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 50 పరుగులు చేయకముందే సగం వికెట్లు కోల్పోయింది. అయితే చివరి ఆటగాళ్లు దూకుడుగా ఆడటంతో 104 పరుగులు చేసింది. హరారే వేదికగా 2022లో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మరో మ్యాచ్ లో 40 పరుగులు కూడా చేయకముందే జింబాబ్వే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కాస్త ప్రతిఘటించడంతో 101 పరుగులు చేసింది.. 2016 షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ జింబాబ్వే 40 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు రాణించడంతో 100 పరుగులు చేసింది.. అయితే హరారే వేదికగా టీమిండియా పై చేసిన 119 పరుగులు ఇప్పటివరకు జింబాబ్వే జట్టుకు అత్యధిక రికార్డు గా(40 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సందర్భంలో) ఉన్నాయి.

    ఇక ఈ మ్యాచ్ లో జింబాబ్వే పై భారత్ గెలిచిన నేపథ్యంలో .. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ దక్కించుకున్నాడు. అతడు జింబాబ్వే జట్టులో ముగ్గురు కీలక ఆటగాళ్లను ఔట్ చేశాడు. ఒకే ఓవర్ లో సికిందర్ రజా, కాంప్ బెల్ ను ఔట్ చేసి, జింబాబ్వే జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత జింబాబ్వే జట్టు ఏ దశలోనూ భారత జట్టును ప్రతిఘటించలేకపోయింది. దీంతో 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.. ఈ విజయం ద్వారా టీమ్ ఇండియా 5 టీ -20 మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తో ముందంజలో ఉంది. ఇటీవల జరిగిన రెండవ టీ -20 మ్యాచ్ లో టీమిండియా 100 పరుగుల తేడాతో జింబాబ్వే పై గెలిచిన సంగతి తెలిసిందే.