Zimbabwe vs India : కష్టపడ్డోడికి కచ్చితంగా విజయం లభిస్తుంది. అలా విజయం లభించినప్పుడు ఆ పడ్డ కష్టం మొత్తం కళ్ళ ముందు అదే సమయంలో మనసులో ఆనందం తాండవం చేస్తుంది.. ప్రస్తుతం ఈ అనుభూతిని గుండెల నిండా ఆస్వాదిస్తున్నాడు టీమిండియా యంగ్ ఆటగాడు యశస్వి జైస్వాల్. ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా.. దూసుకుపోతున్నాడు. నూనూగు మీసాల వయసులోనే ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో మరెన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో..
జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా బుధవారం జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ 36 పరుగులు చేసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టాడు. ఏడాది అన్ని ఫార్మాట్ లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 14 ఇన్నింగ్స్ లలో 65.23 సగటుతో, 85.82 స్ట్రైక్ రేట్ తో 848 రన్స్ చేశాడు.
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 844 రన్స్ (27 ఇన్నింగ్స్) తో మొదటి స్థానంలో కొనసాగేవాడు. కానీ అతడిని యశస్వి అధిగమించాడు. ఏకంగా మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాదిలో రోహిత్ శర్మ 22 ఇన్నింగ్స్ లు ఆడి 833 రన్స్ చేశాడు. రోహిత్ తర్వాత స్థానంలో శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ 833 రన్స్ (26 ఇన్నింగ్స్ లు) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆఫ్గాన్ జట్టు ఓపెనర్ రెహమానుల్లా గుర్భాజ్ 733 రన్స్ (25 ఇన్నింగ్స్ లు) ఐదో స్థానంలో నిలిచాడు.. అయితే ఈ ఆటగాళ్లు మొత్తం ఈ స్థాయిలో పరుగులు చేయడానికి 20కి మించి ఇన్నింగ్స్ లు ఆడారు. అయితే జైస్వాల్ కేవలం 14 ఇన్నింగ్స్ లోనే ఈ స్థాయిలో పరుగులు చేయడం విశేషం. ఏకంగా 800 పరుగుల మైలురాయిని జైస్వాల్ అవలీలగా దాటేశాడు. జైస్వాల్ ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తే.. క్రికెట్ చరిత్రలోనే భారీగా పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిపోయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం అతడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టి20 క్రికెట్ వరల్డ్ కప్ కు ఎంపికైనప్పటికీ.. అతడు రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఒకవేళ అతనికి అవకాశం ఇస్తే.. అతడి పరుగుల రికార్డు సరికొత్త పుంతలు తొక్కేది.
ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడిన యశస్వి జైస్వాల్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్ ఎవరైనా చూడకుండా బాదడమే పనిగా పెట్టుకున్నాడు. సులభంగా ఫోర్లు, సునాయాసంగా సిక్సర్లు కొట్టి తన సత్తా చాటాడు. ఎడమచేతి వాటం బ్యాటింగ్ తో తోపు బౌలర్లకు కూడా చుక్కలు చూపించాడు. సెమీఫైనల్ లో రాజస్థాన్ ఓడిపోయింది గాని.. ఒకవేళ గనుక ఆ మ్యాచ్లో హైదరాబాద్ పై గెలిచి ఉంటే.. యశస్వి జైస్వాల్ చలవ వల్ల కచ్చితంగా ఐపీఎల్ కప్ గెలిచేదని క్రీడా విశ్లేషకులు ఇప్పటికీ అంటుంటారు. వాస్తవానికి ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ జట్టుపై ఎవరికీ ఎటువంటి అంచనాలు లేవు. కానీ తనదైన దూకుడు బ్యాటింగ్ తో జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. రాజస్థాన్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అందువల్లే ఆ జట్టు సెమీ ఫైనల్ దాకా వెళ్ళింది. కేవలం ఆ జోరును ప్లాట్ మైదానాలపైనే కాదు.. బౌన్సీ పిచ్ లపై చూపిస్తున్నాడు యశస్వి..