ZIM vs IND : ఐపీఎల్ లో అలా.. జింబాబ్వేలో ఇలా.. తలలు పట్టుకుంటున్న బీసీసీఐ పెద్దలు..

ZIM vs IND ఇక్కడ సత్తా చాటితేనే భవిష్యత్తు బాగుంటుందని సంకేతాలు ఆల్రెడీ బీసీసీఐ ఇచ్చేసింది. మరి దీనిని ఏ విధంగా ఉపయోగించుకుంటారనేది టీమిండియా ఆడే తదుపరి మ్యాచ్ లలో తేలనుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 6, 2024 9:45 pm

ZIM vs IND

Follow us on

ZIM vs IND : జింబాబ్వే తో 5 t20 ల సిరీస్ ను ప్రకటించగానే మరో మాటకు తావు లేకుండా బీసీసీఐ యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. సీనియర్ ఆటగాళ్లకు మొత్తం విశ్రాంతి ఇచ్చింది. తద్వారా 2026 లో జరిగే టి20 వరల్డ్ కప్ కు యువ జట్టును ఎంపిక చేసే అవకాశం లభిస్తుందని అంచనా వేసింది. ఇందులో భాగంగానే గిల్ నాయకత్వంలో యువ ఆటగాళ్లను జింబాబ్వే పంపించింది. జింబాబ్వే మైదానంపై పట్టు సాధించేందుకు అక్కడ కొద్దిరోజులుగా టీమిండియా ఆటగాళ్లు సాధన చేస్తున్నారు.. కానీ, తొలి టి20లో ఫలితం విరుద్ధంగా వచ్చింది. టీమిండియాతో ఏమాత్రం సరితూగలేని జింబాబ్వే 13 పరుగులతో ఓడించింది.. వాస్తవానికి ఈ మ్యాచ్లో జింబాబ్వే గెలిచింది అని చెప్పే దానికంటే.. భారత్ ఓడింది అని అనడం సబబు. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో పని ఉందన్నట్టుగా టీమిండియా బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఐపీఎల్లో సత్తా చాటిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, ధృవ్ జురెల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ దారుణంగా విఫలమయ్యారు.

ఇటీవల ఐపీఎల్ లో రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, ధృవ్ జురెల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పరుగుల వరద పారించారు. ఆయా జట్ల విజయాలలో కీలకపాత్ర పోషించారు.. కానీ పసి కూనలాంటి జింబాబ్వే జట్టుపై తేలిపోయారు.. వాస్తవానికి జింబాబ్వే జట్టులో అరివీర భయంకరమైన బౌలర్లు లేరు. పోనీ అక్కడి మైదానం పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ టీమిండియా ఆటగాళ్లు జింబాబ్వే బౌలర్లను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. గిల్, వాషింగ్టన్ సుందర్ మాత్రమే జింబాబ్వే బౌలర్లను కాస్తలో కాస్త ప్రతిఘటించారు. మిగతా వాళ్లంతా పూర్తిగా దాసోహం అయ్యారు. సరిగ్గా వారం క్రితం టీమిండియా టి20 వరల్డ్ కప్ లో విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టును ఏడు పరుగుల తేడాతో ఓడించింది. కానీ వారం గడిచే సమయానికి పసి కూనలాంటి జింబాబ్వే పై ఓడిపోయి పరువు పోగొట్టుకుంది.

వాస్తవానికి ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లు.. జింబాబ్వే పర్యటనలో అదరగొడతారని బీసీసీఐ భావించింది. యువ ఆటగాళ్లు జింబాబ్వేలో సత్తా చాటుతారని అంచనా వేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో.. సత్తా చాటే యువ ఆటగాళ్లను వారి స్థానంలో భర్తీ చేయాలని భావించింది. బీసీసీఐ ఆలోచన ఒక విధంగా ఉంటే.. యువ ఆటగాళ్లు మాత్రం మరో విధంగా ఆడారు. అందువల్లే పరువు పోగొట్టుకున్నారు. ఇదే సమయంలో బీసీసీఐ సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. తొలి మ్యాచ్లో ఓటమి నేపథ్యంలో.. మిగతా నాలుగు మ్యాచ్లలో విజయం సాధించి.. తాము కేవలం ప్లాట్ మైదానాలపై ఆడే ఆటగాళ్ళం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత యువ ఆటగాళ్లపై ఉంది. ఇక్కడ సత్తా చాటితేనే భవిష్యత్తు బాగుంటుందని సంకేతాలు ఆల్రెడీ బీసీసీఐ ఇచ్చేసింది. మరి దీనిని ఏ విధంగా ఉపయోగించుకుంటారనేది టీమిండియా ఆడే తదుపరి మ్యాచ్ లలో తేలనుంది.