ZIM vs IND : టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటిస్తోంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో.. యువ ఆటగాళ్లు ఐదు t20 ల సిరీస్ లో భాగంగా జింబాబ్వే వెళ్లారు. యువ జట్టుకు గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా తొలి మ్యాచ్ శనివారం జరిగింది. ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్ గా టీమిండియా బరిలోకి దిగింది. కానీ ఫలితం మాత్రం వేరే వచ్చింది..
జింబాబ్వే పర్యటనలో తొలి టి20 మ్యాచ్లో టీమిండియా కు పరాజయం ఎదురయింది. తొలి మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు చెత్త బ్యాటింగ్ వల్ల 13 పరుగులతో ఓడిపోవలసి వచ్చింది. సరిగ్గా వార క్రితం టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఆ ఘనవిజయాన్ని మర్చిపోకముందే పసి కూన జింబాబ్వే చేతిలో దారుణమైన వైఫల్యాన్ని మూటగట్టుకుంది..
టి20 ప్రపంచ కప్ లో సత్తా చాటిన సీనియర్ ఆటగాళ్లకు మొత్తం బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లకు ఈ టోర్నీలో అవకాశం ఇచ్చింది..గిల్ నాయకత్వంలో యువ ఆటగాళ్లు సత్తా చూపించలేక చేతులెత్తేశారు. ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో బ్యాట్లెత్తేశారు. దారుణమైన షాట్లు ఆడుతూ మూల్యం చెల్లించుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 115 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే బ్యాటర్లలో క్లైవ్ మదాండే (29*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెన్నెట్(22), వెస్లీ (21), మేయర్స్(23) పరుగులు చేసి ఆకట్టుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్ లో మొత్తం నలుగురు ఆటగాళ్లు 0 పరుగులకు వెనుతిరి గారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(4/13), వాషింగ్టన్ సుందర్ (2/11) సత్తా చాటారు. ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన టీమ్ ఇండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆల్ అవుట్ అయింది. గిల్(29 బంతుల్లో ఐదు ఫోర్ ల సహాయంతో 31), వాషింగ్టన్ సుందర్ (34 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ సహాయంతో 27), ఆవేష్ ఖాన్(12 బంతుల్లో మూడు ఫోర్ల సహాయంతో 16) డబుల్ డిజిట్ పరుగులు చేశారు. ఆటగాళ్లు మొత్తం విఫలమయ్యారు.. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఐపీఎల్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ (0), రియాన్ పరాగ్ (0), జురెల్(6) పూర్తిగా నిరాశపరిచారు. భారీ అంచనాలు పెట్టుకుంటే రుతురాజ్ గైక్వాడ్ (7), రింకూ సింగ్(0) విఫలమయ్యారు.
జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా (3/25), చతరా(3/16) టీమిండియా పతనాన్ని శాసించారు. బెన్నెట్, వెల్డింగ్టన్, బ్లెస్సింగ్, జొంగ్వే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. రెండవ టి20 మ్యాచ్ ఆదివారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.