Yuvraj Singh: టీం ఇండియాకు రెండు ప్రపంచకప్ లు అందించడంలో కెప్టెన్ ధోని, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ల పాత్ర కీలకమైంది. 2007 టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచ కప్ లను భారత్ కైవసం చేసుకోవడం వెనుక వీరిద్దరి కృషి ఎంతో ఉంది. కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని, ఆల్ రౌండర్ గా యువీలు రాణించడం వల్లే టీం ఇండియాకు 1983 తర్వాత రెండు ప్రపంచ కప్ లను దక్కించుకుంది.
టీం ఇండియాకు ఆడుతున్న సమయంలో వీరిద్దరు చాలా స్నేహంగా ఉండేవారు. అయితే కొన్నాళ్లకు వీరిమధ్య మనస్పర్థలు వచ్చి ఎడమొఖం పెడముఖంగా ఉన్నారు. అయితే యువరాజ్ సింగ్ ధోనిపై ఎప్పుడు బహిరంగంగా విమర్శలు చేయకపోయినప్పటికీ ఆయన తండ్రి యోగ్ రాజ్ మాత్రం ధోనిపై అప్పట్లో సంచలన కామెంట్స్ చేస్తూ తరుచూ వార్తల్లో నిలిచేవారు.
తాజాగా యువరాజ్ సింగ్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధోని కెరీర్ పై సంచలన కామెంట్స్ చేశారు. టీం ఇండియా ఆటగాళ్లలలో ఝార్జండ్ డైనమైట్ ధోనికి లభించినంత మద్దతు ఏ క్రికెటర్ కు కూడా లభించలేదని తెలిపాడు. కోచ్, కెప్టెన్ సహకారం ఉంటే జట్టులో ఎంతకాలమైన ఆడొచ్చనడానికి ధోనికే మంచి ఉదాహరణ అని పేర్కొన్నాడు.
ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, ఫామ్ కోల్పోయినా కూడా కోచ్ రవిశాస్త్రి, అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుతోనే అతడు అనుకున్నన్ని రోజులు టీంఇండియాకు ఆడగలిగాడని చెప్పుకొచ్చాడు. ధోనికి మాదిరిగా వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, వీవీఎస్.లక్ష్మణ్ లకు మద్దతు లభించలేదన్నాడు. అందుకే వారి కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయిందన్నాడు.
కోచ్, కెప్టెన్ సహకారం ఆటగాడికి ఉంటే అతడి ఆటలో స్వేచ్ఛ కన్పిస్తుందన్నాడు. అలా కాకుండా ‘నీ మెడపై కత్తి వేలాడుతుందని తెల్సినప్పుడు ఆటగాడు స్వేచ్ఛగా ఆడలేడని’ తెలిపారు. ఇదిలా ఉంటే వీరిద్దరి అంతర్జాతీయ కెరీర్ ఒక ఏడాది తేడాతో ముగిసింది. 2019లో యువీ క్రికెట్ కు రిట్మెంట్ ప్రకటించగా ధోని 2020 ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ తర్వాత వీరిద్దరు ఐపీఎల్ లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నారు.