Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ ఈ ఏడాది టెస్ట్ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. పింక్ బాల్ గేమ్ ను కాస్త వైట్ బాల్ గేమ్ గా మార్చుతున్నాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా రెచ్చిపోతున్నాడు. మైదానం ఏదైనా సరే బాదడమే మంత్రంగా పెట్టుకుంటున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయ్యి విమర్శల పాలైన యశస్వి.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఆకాశమేహద్దుగా చెలరేగిపోతున్నాడు.. కమిన్స్, స్టార్క్, హేజిల్ వుడ్, లయన్, హెడ్, మార్ష్, లబూ షేన్.. ఇలా ఎవరి బౌలింగ్ కూడా వదలకుండా ధాటిగా ఆడుతున్నాడు. 193 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 90 పరుగులు చేశాడు. మరో 10 పరుగులు చేస్తే జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ ఘనతను అందుకుంటాడు. అయితే ఇదే క్రమంలో యశస్వి జైస్వాల్ మరో రికార్డ్ కూడా సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఈ ఏడాది అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
దిగ్గజ ఆటగాడి సరసన
టెస్ట్ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఇప్పటివరకు న్యూజిలాండ్ ప్లేయర్ మెక్ కులమ్ రికార్డు సృష్టించాడు. 2014లో అతడు 33 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు జైస్వాల్ అతడి సరసన నిలిచాడు. ఈ ఏడాది జైస్వాల్ 33 సిక్స్ లు కొట్టాడు. మెక్ కులమ్ రికార్డును బద్దలు కొట్టడానికి ఒక్క సిక్సర్ దూరంలో ఉన్నాడు. మరొక సిక్సర్ కొడితే యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇక రెండో స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ కొనసాగుతున్నాడు. 2022లో అతడు 26 సిక్సర్లు కొట్టాడు. ఇక 2005లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ 22 సిక్సర్లు కొట్టాడు. 2008లో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 22 సిక్స్ లు కొట్టాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే యశస్వి జైస్వాల్ మరెన్నో రికార్డులు సాధించేలాగా కనిపిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భారత్ ఆస్ట్రేలియాతో ఇంకా నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ ప్రకారం అతడు మరిన్ని సిక్సర్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. పెర్త్ టెస్టులో రెండవ ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు కేఎల్ రాహుల్ తో కలిసి యశస్వి జైస్వాల్ తొలి వికెట్ కు 172 పరుగులు జోడించాడు. తొలి ఇన్నింగ్స్ 46 లీడ్ కలుపుకొని భారత్ ఆధిక్యం ప్రస్తుతం 218 పరుగులకు చేరుకుంది. భారత ఓపెనర్లు మూడో రోజు కూడా ఇదే జోరు కొనసాగిస్తే భారత్ లీడ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే పెర్త్ టెస్టులో రెండవ రోజు టీమిండియా పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.