MLC Jaya Mangalam Venkataramana : వైసీపీకి మరో షాక్ తగిలింది. మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది నాయకులు పార్టీని వీడారు. పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నాయకులు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతున్నారు. అయితే రాజ్యసభ, ఎమ్మెల్సీ వంటి పదవులను వదులుకొని సైతం బయటకు వెళ్ళిపోతున్నారు. అయితే జగన్ ఏరి కోరి పిలిచి పదవులు ఇచ్చిన వారు సైతం ఇప్పుడు దూరమవుతున్నారు.టిడిపి నుంచి పిలిచి ఎమ్మెల్సీ సీటు కట్టబెట్టిన కృష్ణా జిల్లా కు చెందిన నేత తాజాగా గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీకి సైతం రాజీనామా చేశారు. మరికొందరు ఇదే బాటలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో వైసిపి ఒక్కసారిగా అలెర్ట్ అయింది.ఎవరెవరు రాజీనామా చేసి అవకాశం ఉందో వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు వైసీపీ సీనియర్లు. పార్టీలో కొనసాగేలా వారిని ఒప్పిస్తున్నారు.
* ఎమ్మెల్సీ జయమంగళం రాజీనామా
వైసీపీ ఎమ్మెల్సీ జయ మంగళం వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి సైతం రిజైన్ చేశారు. మండలి చైర్మన్ మోసేన్ రాజుకు పంపారు. 2009లో ఆయన టిడిపి నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో పొత్తులో భాగంగా ఆసీటు బిజెపి కి కేటాయించింది తెలుగుదేశం. దీంతో అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు కామినేని శ్రీనివాస్. చంద్రబాబు క్యాబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రిగా పోటీ చేశారు. అయితే 2019లో మాత్రం జయ మంగళం వెంకటరమణకు టిడిపి టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన దూలం నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు జై మంగళం వెంకటరమణ. వెంటనే ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూనే పార్టీని వీడారు వెంకటరమణ.
* అనూహ్యంగా వైసీపీలోకి
ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డారు వెంకటరమణ.టిడిపి టికెట్ ఆశించారు.అయితే ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తుకు సిద్ధపడింది టిడిపి. అదే జరిగితే కామినేని శ్రీనివాస్ కు మరోసారి టికెట్ దక్కుతుందని ప్రచారం సాగింది. కామినేని సైతం పొత్తు లేకపోతే టిడిపిలోకి వచ్చి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి మంచి ఆఫర్ రావడంతో వెంకటరమణ ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. వెళ్లిన వెంటనే జగన్ ఎమ్మెల్సీ ని చేశారు. కానీ ఈ ఎన్నికల్లో వైసిపి ఓడిపోయిన నాటి నుంచి సైలెంట్ గా ఉన్నారు జయ మంగళం.ఇప్పుడు ఏకంగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.త్వరలో ఆయన జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే జయ మంగళం వెంకటరమణ బయటపడినట్లు తెలుస్తోంది. ఈయన బాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.