https://oktelugu.com/

IND Vs AUS BGT 2024 : అరుదైన ఘనత సాధించిన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్.. మరో మూడు పరుగులు చేస్తే.. వారి సరసన..

పెర్త్ టెస్ట్ లో రెండవ రోజు భారత జట్టు పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బౌలింగ్ లో బ్యాటర్లు అదరగొడితే.. బ్యాటింగ్లో ఓపెనర్లు దూకుడు కొనసాగించారు. మొత్తంగా పెర్త్ టెస్ట్ లో ఆతిధ్య ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 23, 2024 / 04:57 PM IST

    Fourth-highest Opening partnership against Australia.

    Follow us on

    IND Vs AUS BGT 2024 :  తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా జట్టు 104 పరుగులకు కుప్ప కూలింది. కెప్టెన్ బుమ్రా ఐదు వికెట్లు సాధించాడు. హర్షిత్ రాణా మూడు వికెట్లు దక్కించుకున్నాడు. సిరాజ్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు దూకుడుగా ఆడింది. తొలి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయిన యశస్వి జైస్వాల్.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు. 193 బంతులు ఎదుర్కొన్న అతడు ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 90* పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 153 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సహాయంతో 62* పరుగులు చేశాడు. అభేద్యమైన తొలి వికెట్ కు వీరిద్దరూ 172 పరుగులు జోడించారు. వీరిద్దరిని అవుట్ చేయడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించాడు. చివరికి హెడ్ తో కూడా బౌలింగ్ చేయించాడు.. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది..

    సరికొత్త రికార్డులు

    పెర్త్ మైదానంలో సంచలన ఆట తీరు ప్రదర్శించిన ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డులను సృష్టించారు. టీమ్ ఇండియా తరఫున ఆస్ట్రేలియాపై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో ద్వయంగా ఘనత సాధించారు.

    1981లో మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో సునీల్ గవాస్కర్ (70), చేతన్ చౌహన్ (85) పరుగులు చేశారు.

    1985లో అడి లైడ్ వేదికగా సునీల్ గవాస్కర్ (166*), కృష్ణమాచారి(51) పరుగులు చేశారు.

    సిడ్ని వేదికగా 1986లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సునీల్ గవాస్కర్ (172), కృష్ణమాచారి శ్రీకాంత్ (116) పరుగులు చేశారు.

    2024లో పెర్త్ వేదికగా యశస్వి జైస్వాల్ (90*), కేఎల్ రాహుల్ (62*) పరుగులు చేశారు. ఐతే వీరిద్దరూ మరో మూడు పరుగులు చేస్తే 1981 లో మెల్బోర్న్ వేదికగా సునీల్ గవాస్కర్, చేతన్ చౌహన్ సృష్టించిన రికార్డును బద్దలు కొడతారు. ఒకవేళ గనుక ఇద్దరు సెంచరీలు చేస్తే 1986లో సునీల్ గవాస్కర్, శ్రీకాంత్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొడతారు. కాగా, పెర్త్ మైదానం తొలి రోజు బౌలింగ్ కు అనుకూలించగా.. రెండవ రోజు మధ్యాహ్నం తర్వాత బ్యాటర్లకు అనుకూలిస్తోంది. మైదానంపై పచ్చిక తొలగిపోవడంతో బంతులు బౌలర్లు అనుకున్న దిశలో పడటం లేదు. దీంతో బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ స్థిరంగా ఆడటంతో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటికైతే ఆస్ట్రేలియాపై 218 పరుగుల లీడ్ లో ఉంది ఇలానే వారిద్దరూ మూడో రోజు కూడా ఆడితే భారత్ ఆధిక్యం మరింత పెరుగుతుంది.