WTC 2025 : ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో భారత్ మూడు టెస్టులు ఆడింది. ఈ మూడు టెస్టులలో ఓటమి పాలైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ తొలిసారి వైట్ వాష్ కు గురైంది.. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ టేబుల్ లో రెండవ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా మొదటి స్థానానికి చేరుకుంది. ఈ పరాభవం నుంచి బయటపడటానికి భారత్ ఆస్ట్రేలియా బయలుదేరింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్ట్ లు ఆడుతోంది. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అదే జోరును అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో కొనసాగించలేకపోయింది. చరిత్రలో తొలిసారిగా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు ఆల్ అవుట్ అయింది. రెండవ ఇన్నింగ్స్ లో 175 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఎదుట 18 పరుగుల విజయ లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు కేవలం 3.2 ఓవర్లలోనే 19 పరుగులను కొట్టేసి విజయాన్ని దక్కించుకుంది. రెండు జట్లు చెరొక విజయం సాధించడంతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ 1-1 తో సమం అయ్యింది.
పడిపోయిన ర్యాంక్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ కచ్చితంగా నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించాల్సి ఉంది. అయితే ఇప్పటికి ఒక విజయం సాధించిన భారత్.. మిగతా మూడు మ్యాచ్లు గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే ఇతర జట్ల మ్యాచ్ లపై ఆధార పడాల్సి ఉంటుంది. పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత భారత్ వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి చేరుకుంది. కానీ ఆ స్థానాన్ని నిలుపుకోవడంలో దారుణంగా విఫలమైంది.. అడిలైడ్ టెస్టుల్లో పది వికెట్ల తేడాతో ఓడిపోవడం తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ టేబుల్ లో మూడవ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలోకి దక్షిణాఫ్రికా చేరుకుంది.. ప్రస్తుతం పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా 60.71 శాతంతో అగ్రస్థానం, దక్షిణాఫ్రికా 59.26 శాతంతో రెండవ స్థానం, 57.29 శాతంతో మూడో స్థానంలో భారత్ నిలిచింది. తదుపరి మ్యాచ్ లలో భారత్ కచ్చితంగా గెలవాలి. లేనిపక్షంలో ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడం కష్టమవుతుంది. తొలి టెస్టులో అన్ని రంగాలలో రాణించిన భారత ఆటగాళ్లు.. రెండో టెస్టుకు వచ్చేసరికి పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా బ్యాటర్లు చేతులెత్తేశారు.. బౌలర్లు కీలక సమయంలో సత్తా చాటలేకపోయారు. ఫలితంగా భారత్ పది వికెట్ల తేడాతో దారుణమైన ఓటమిని మూటకట్టుకోవాల్సి వచ్చింది.