Homeక్రీడలుక్రికెట్‌Women T20 World Cup 2024: దురదృష్టం వెంటాడుతోంది.. నిన్న పురుషులు.. నేడు మహిళలు.. పాపం...

Women T20 World Cup 2024: దురదృష్టం వెంటాడుతోంది.. నిన్న పురుషులు.. నేడు మహిళలు.. పాపం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు

Women T20 World Cup 2024: ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 రన్స్ చేసింది. అమేలియా 43 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఎం లాబా రెండు వికెట్లు సాధించింది. ఆ తర్వాత 159 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 రన్స్ మాత్రమే చేయగలిగింది. 33 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టి20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు ప్రారంభం నుంచి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఒత్తిడికి తలవంచింది. ఒకానొక దశలో ఆరు ఓవర్లకు 47/0 వద్ద నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు.. 14 ఓవర్ల నాటికి 86/5 తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కెప్టెన్ వోల్వార్ట్ ధాటిగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. మిగతా ప్లేయర్లు న్యూజిలాండ్ బౌలర్లు వేసిన స్లో డెలివరీలను ఎదర్కొలేక బోల్తా పడ్డారు.. కీలక సమయంలో తజ్మీన్, వోల్వార్ట్, బాష్, మరిజెన్ వంటి ప్లేయర్లు అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా ఏ దశలలోనూ కోలుకోలేకపోయింది. ఒకానొక దశలో విజయ సమీకరణం 36 బంతుల్లో 73 పరుగులకు చేరుకున్నప్పుడు.. దక్షిణాఫ్రికా బ్యాటర్లు సంచలనం సృష్టిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఆ జట్టు ఆటగాళ్లు న్యూజిలాండ్ బౌలర్ల ముందు చేతులెత్తేశారు..

బౌలింగ్ లోనూ..

బ్యాటింగ్లో మాత్రమే కాకుండా… బౌలింగ్ లోనూ దక్షిణాఫ్రికా బౌలర్లు చేతులెత్తేశారు. 13 ఓవర్ల వరకు న్యూజిలాండ్ జట్టును 85/3 వద్ద ఉంచగలిగిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాటర్ల ముందు తలవంచారు. 13 ఓవర్ నాటి నుంచి న్యూజిలాండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడటం మొదలుపెట్టారు. చివరి ఏడు ఓవర్లలో ఏకంగా 73 పరుగులు సాధించారంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎలా ఉందో.. దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడమే ఆ జట్టు ఓటమికి కారణమైంది. ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. వికెట్లను కోల్పోకుండా సమయమనంతో ఆడింది. మధ్య ఓవర్లలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ నత్తనడక లాగా ఉన్నప్పటికీ.. ఆ తదుపరి ఓవర్లలో న్యూజిలాండ్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు.. ప్రారంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. ఆ తర్వాత లయను కోల్పోయారు.

అప్పుడు కూడా..

ఇక ఇటీవల వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ దక్షిణాఫ్రికా పురుషుల జట్టు ఒత్తిడికి చిత్తయింది. ఒకానొక దశలో క్లాసెన్ దూకుడుకు గెలిచేలాగా కనిపించిన ఆ జట్టు.. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో చేతులెత్తేసింది. ఒత్తిడిని ఎదుర్కోలేక భారత్ ముందు తలవంచింది. అదే సీన్ ను మహిళల జట్టు కూడా కొనసాగించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు పై సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ” దురదృష్టకరమైన జట్టని” సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version