Sunrisers Hyderabad : ఆదివారం చెన్నై వేదికగా కోల్ కతా జట్టుతో హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్లో తలపడింది.. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో విధ్వంసకరమైన ఆట తీరును ప్రదర్శించిన ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ బరిలోకి వచ్చారు. అభిషేక్ శర్మ రెండు పరుగులు మాత్రమే చేసి స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏదో దురదృష్టం కొద్దీ వికెట్ పోయిందని అటు అభిమానులు, ఇటు హైదరాబాద్ ఆటగాళ్లు అనుకున్నారు. ఇలాంటి సమయంలో మరో ఎండ్ లో ఉన్న ఆటగాడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తనకు స్ట్రైకింగ్ అవకాశం వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి. అదేం చిత్రమో తెలియదు గాని.. మరో ప్రమాదకరమైన ఓపెనర్ హెడ్ వైభవ్ అరోరా బౌలింగ్లో నిర్లక్ష్యమైన షాట్ ఆడి.. కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాస్తలో కాస్తంత హెడ్ నిలకడ ప్రదర్శించి ఉంటే హైదరాబాద్ బ్యాటింగ్ మరో విధంగా ఉండేది..కచ్చితంగా మూడోసారి సన్ రైజర్స్ కు ట్రోఫీ లభించేది. నిలకడ అనేది లేకపోవడంతో హైదరాబాద్ చేజేతులా ఓడిపోయింది. హైదరాబాద్ ఆట తీరుకు ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఈ సీజన్లో ఇలాంటివి చాలానే జరిగాయి.
ఈ సీజన్లో హైదరాబాద్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేశారు. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ముఖ్యంగా హెడ్, అభిషేక్ శర్మ సరికొత్త రికార్డులు సృష్టించారు. ముంబై జట్టుపై 277 పరుగులు, బెంగళూరు పై 287 రన్స్ చేసి హైదరాబాద్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది.. ఢిల్లీ జట్టుపై పవర్ ప్లే లో ఏకంగా 125 పరుగులు కొట్టేసింది. లక్నో జట్టుపై 10 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. అయితే ఇన్ని ఘనతలు ఉన్న హైదరాబాద్ జట్టు.. నిలకడను మాత్రం ప్రదర్శించలేకపోయింది. హైదరాబాద్ ఆటగాళ్లు.. కొడితే ఆకాశమే హద్దుగా కొట్టేశారు.. లేకుంటే పేక మేడలా కూలిపోయారు.. చివరికి ఫైనల్ మ్యాచ్లోనూ ఇదే ధోరణి ప్రదర్శించడంతో 113 పరుగులకే హైదరాబాద్ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసిన చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకుంది..
ఈ సీజన్లో హెడ్, అభిషేక్ శర్మ నిలకడను ప్రదర్శించి ఉంటే జట్టుపై ఆ ప్రభావం ఉండేది కాదు. కొన్ని మ్యాచ్లలో వీర విహారం చేయడం.. మరికొన్ని మ్యాచులలో 0 పరుగులకే అవుట్ కావడంతో.. ఆ ప్రభావం మిగతా జట్టుపై పడింది. పైగా జట్టుకూర్పు విషయంలో మేనేజ్మెంట్ సరైన నిర్ణయం తీసుకోలేదు. అబ్దుల్ సమద్, మార్క్రం వంటి వారు రాణించకపోయినప్పటికీ.. వారికి పదేపదే అవకాశాలు ఇచ్చింది. ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్ళను పక్కనపెట్టింది. చివరికి ఫైనల్ మ్యాచ్ లోనూ ఇదే ధోరణి కొనసాగించింది. ఫలితంగా హైదరాబాద్ జట్టుకు కీలక సమయంలో మెరుగైన బ్యాటర్లు లేకపోవడంతో కోల్ కతా చేతిలో ఫైనల్ మ్యాచ్లో, చేతులు ఎత్తేయాల్సి వచ్చింది. ఒకవేళ హైదరాబాద్ జట్టు కనుక ప్రారంభం నుంచి ముగింపు వరకు నిలకడతో కూడిన ఆట తీరని ప్రదర్శించి ఉంటే.. ఆ జట్టు రూపురేఖలు మరో విధంగా ఉండేవి. ఇలాంటి నిలకడైన ఆట తీరు ప్రదర్శించింది కాబట్టి, కోల్ కతా వరుస విజయాలు సాధించింది.. మూడోసారి సగర్వంగా ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకుంది. సంబరాలలో మునిగి తేలుతోంది.