Carlos Alcaraz: జోకోవిచ్, ఫెడరర్, నడాల్.. ఈ త్రయాన్ని ఢీ కొట్టే ఆటగాడు వస్తాడా? అని ఇన్ని రోజులు టెన్నీస్ అభిమానుల్లో ఒకింత సందిగ్ధం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పటాపంచలైంది.. ఈ ముగ్గురికి సవాల్ విసిరే ఒక ఆటగాడిగా వింబుల్డన్ లో ఆవిర్భవించాడు. సిట్సి పాస్, సిన్నర్, రూడ్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. జోకోవిచ్, ఫెడరర్, నడాల్ ను ఓడించి ఒక్క గ్రాండ్ స్లామ్ నైనా అందుకున్న ఘనత వారు ఇంకా సాధించలేదు. కానీ స్పెయిన్ యువకెరటం ఆల్కారస్ ప్రపంచ టెన్నిస్లో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే ఫ్రెండ్ గ్రాండ్ స్లామ్ లు సొంతం చేసుకున్నాడు. అందులోనూ ఒకటి జోకోవిచ్ ను ఓడించి అందుకోవడం అతడి సత్తాకు నిదర్శనం. అందుకే పురుషుల టెన్నిస్ భావి స్టార్ గా అల్కా రస్ ను క్రీడా పండితులు పరిగణిస్తున్నారు. ఐదు సెట్ల సమాహారమైన టెన్నిస్ లో అమోఘమైన రికార్డు ఉన్నజోకోవిచ్ ను ఓడించడం అంత సులువు కాదు. 19 సంవత్సరాలకే నెంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకొని రికార్డు సృష్టించడంతోనే అందరి దృష్టి ఈ స్పెయిన్ టీనేజర్ పై పడింది. మూడు సంవత్సరాల ప్రొఫెషనల్ కెరియర్లో రెండు గ్రాండ్ స్లాములు సాధించడం అంటే అంత సులభమైన విషయం కాదు.. ఈ విజయాలు అతడి ప్రతిభకు నిదర్శనం గా నిలుస్తున్నాయి.
ఇద్దరిలో అవే పోలికలు
వింబుల్డన్ ట్రోఫీ నెగ్గిన నేపథ్యంలో అటు అల్కారస్, ఇటు జోకోవిచ్ మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అల్కారస్ శరీర దారుఢ్యాన్ని కాపాడుకోవడం, దూకుడు అయిన ఆట తీరులో నదాల్ ను తలపిస్తాడు. కోర్టు నలుమూలలా పరిగెడుతూ ప్రత్యర్థుల షాట్లను తిప్పికొట్టే తీరు అచ్చం జోకో విచ్ లా ఉంటుంది. మరి ఈ దిగ్గజ త్రయం లోని ఇద్దరు స్టార్ల ఆటను పుణికిపుచ్చుకున్న అల్కారస్ భవిష్యత్తులో వారి స్థాయిని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
బలమైన ఫోర్ హాండ్ షాట్లు
ఇక అల్కారస్ ప్రధాన బలం.. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మైదానం నలుమూలలా బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లు కొట్టడం..ఇదే వర్తమాన టెన్నిస్ ప్రపంచంలో సరికొత్త తారగా నిలబెడుతోంది. జొకోవిచ్ లాంటి దిగ్గజ ఆటగాడితో ఏకంగా నాలుగు గంటల 42 నిమిషాల పాటు ఫైనల్ మ్యాచ్ ఆడాడు అంటే అల్కారస్ క్రీడా నైపుణ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్లో 9 ఏస్ లు సంధించి జోకో ను కోలుకోకుండా చేశాడు.. తొలి సెట్ కోల్పోయినప్పటికీ ఏ మాత్రం నిరాశ పడకుండా సర్వీస్ ను కాపాడుకుంటూ మిగతా సెట్ లను గెలిచాడు అంటే అతడు ఎలాంటి స్థితిలోనైనా గెలవగలను అనే ఉద్దేశాన్ని టెన్నిస్ ప్రపంచానికి చాటాడు. కేవలం 20 సంవత్సరాల వయసులోనే రెండవ గ్రాండ్ స్లామ్ సాధించి .. టెన్నిస్ ప్రపంచంలో సరికొత్త ధ్రువతారగా ఆవిర్భవించాడు. ఇక ఆల్కారస్ సాధించిన విజయం పట్ల ప్రపంచవ్యాప్తంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో అతడి పేరు ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉంది.