IND vs AUS 3rd Test : అడిలైడ్ టెస్ట్ లో ఓడిపోవడం సగటు భారతీయ అభిమానిని నిరాశ పరిచింది. ఏకంగా పది వికెట్ల తేడాతో ఓడిపోవడం బాధను కలిగించింది. ఈ నేపథ్యంలో ఆ ఓటమి నుంచి తేరుకోవాలంటే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో చోటు తగ్గించుకోవాలంటే టీమిండియా శుక్రవారం నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభమయ్యే టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది.. ఇక్కడి గబ్బా మైదానంలో సరిగ మూడు సంవత్సరాల క్రితం రిషబ్ పంత్, గిల్ అద్భుతం చేశారు. చెలరేగి ఆడటంతో భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటూ టీమిండియా గెలవాల్సిన అవసరాన్ని అభిమానులు ప్రస్తావిస్తున్నారు. గబ్బా మైదానం ఆస్ట్రేలియా ఆటగాళ్లకు స్వర్గధామం. 2020 -21 సీజన్ లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని ఈ మైదానం వేదికగా సొంతం చేసుకుంది. వాస్తవానికి నాటి సిరీస్ సమయంలో.. ఇప్పుడున్న పరిస్థితులే అప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే నాటి సిరీస్ లో నాలుగో టెస్ట్ గబ్బా మైదానంలో జరిగింది. ఇప్పుడు మూడవ టెస్ట్ జరుగుతోంది. 2020 -21 సిరి సమయంలో నాలుగో టెస్ట్ నాటికి రెండు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. 32 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాకు గబ్బా మైదానంలో ఓటమి అనేది ఎదురు కాలేదు. ఆ సమయంలో ఇండియా గెలవడం సాధ్యం కాదని అభిమానులు ఒక అంచనాకు వచ్చారు. అంతేకాదు ఆస్ట్రేలియా విధించిన 329 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఛేదించలేదని భావించారు. కానీ ఆ లక్ష్యాన్ని భారత్ ఏడు వికెట్లు కోల్పోయి సాధించింది.
ఆ మ్యాచ్ లో గిల్ 91 రన్స్ చేశాడు. రిషబ్ పంత్ చివరి వరకు మైదానంలో ఉండి.. 89 పరుగులు చేసి.. భారత జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాగూర్ 7 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఈ విజయం ద్వారా టీమ్ ఇండియా నాటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో సాధించింది. బలమైన ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండవసారి టెస్ట్ సిరీస్ ను టీమిండియా సొంతం చేసుకుంది. ఈ ఘనతను ఏ జట్టు కూడా సాధించలేదు.. ఆ సిరీస్లో భారత్ విజయం సాధించిన తర్వాత రిషబ్ పంత్, హనుమ విహారి, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన పేరు గడించారు. నాడు విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో అజింక్యా రహానే సారధ్యంలో టీమిండియా మిగతా మూడు టెస్టులు ఆడింది..
ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి
టీమిండియా ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-1 తో ఉంది. ఈ సమయంలో జట్టుకు ఒక విజయం కావాలి. ఇందులో భాగంగా గత సిరీస్లో అనుసరించిన పోరాటపటి మను ఈసారి కూడా ప్రదర్శించాలి.. అప్పుడే టీమ్ ఇండియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆశలు ఉంటాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ వెళ్లడానికి దారులు ఏర్పడతాయి. లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు. మూడు సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాపై టీం ఇండియా సాధించిన విజయంలో రోహిత్ నుంచి మొదలుపెడితే సిరాజ్ వరకు ఉన్నారు. నాటి మ్యాచ్లో అశ్విన్, జడేజా, విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి వారు లేరు. మరి నాటిస్ఫూర్తిని నేడు కొనసాగిస్తారా.. ఒత్తిడిలో చిత్తవుతారా? అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.