Mumbai Indians
Mumbai Indians: ఐపీఎల్ ( Indian premier league 2025) 2025 కు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. దీంతో మరికొద్ది రోజుల్లో అసలు సిసలైన క్రికెట్ పండుగ మొదలుకానుంది. ఐపీఎల్ 18వ సీజన్లో ట్రోఫీ దక్కించుకోవాలని అన్ని జట్లు భావిస్తున్నాయి. ఇటీవల జరిగిన మెగా వేలంలో సమర్థవంతమైన ఆటగాళ్లను దక్కించుకొని పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నాయి. మేటి ఆటగాళ్ళను దక్కించుకున్న నేపథ్యంలో జట్లన్నీ సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2025 సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో.. ఏ జట్టు ఎన్నడు ఎవరితో పోటీ పడుతుందనేది తేలిపోయింది. దీంతో అభిమానులు కూడా ఒక అంచనాకు వచ్చారు… అయితే ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైన తర్వాత ముంబై జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది.. ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Mumbai team captain Hardik Pandya) తొలి మ్యాచ్ కు దూరం కానున్నాడు. ముంబై జట్టు 18 వ సీజన్లో తన తొలి మ్యాచ్ మార్చి 23న చెన్నై జట్టుతో ఆడునుంది. అయితే గత సీజన్లో స్లో ఓవర్ రేటు వల్ల హార్దిక్ పాండ్యా పై తదుపరి మ్యాచ్ ఆడకుండా నిషేధం పడింది. ఇందులో భాగంగానే అతడు తొలి మ్యాచ్ కు దూరం కానున్నాడు. హార్దిక్ పాండ్యా దూరంగా ఉంటే అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే దానిపై ముంబై జట్టు మల్ల గుల్లాలు పడుతున్నది.
గత సీజన్లో..
ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యాకు మెరుగైన రికార్డు ఉంది. గుజరాత్ జట్టు ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంవత్సరంలోనే ఆ జట్టును విజేతగా నిలిపిన ఘనత హార్దిక్ పాండ్యాది. ఆ తర్వాత తదుపరి సీజన్లో అతడు గుజరాత్ జట్టును వదిలిపెట్టి.. ముంబై జట్టుకు నాయకుడయ్యాడు. వాస్తవానికి ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమిస్తారని ఎవరూ ఊహించలేదు. 2023లో వన్డే వరల్డ్ కప్ లో ఆడుతుండగా హార్దిక్ పాండ్యాకు గాయం అయింది. గాయం కారణంగా ఆ టోర్నీలో కీలక మ్యాచ్లలో తప్పుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ లోకి ముంబై జట్టు కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయంపై ముంబై జట్టు ఒకప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ తో మేనేజ్మెంట్ ఏమాత్రం చర్చించలేదు. దీంతో కొద్దిరోజులపాటు రోహిత్ శర్మ ముభావంగా ఉన్నాడు. ఆ తర్వాత తేరుకున్నాడు. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుపొందిన ముంబై.. గత సీజన్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నప్పటికీ ఏమంత గొప్పగా రాణించలేదు. మరి ఇప్పుడు ఎలా ఆడుతుందో చూడాల్సి ఉంది..అన్నట్టు తొలి మ్యాచ్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించే అవకాశం ఉంది.. మరి దానికి రోహిత్ ఎలా రెస్పాండ్ అవుతాడనేది చూడాల్సి ఉంది. అయితే రోహిత్ తొలి మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతని ఆధ్వర్యంలో ముంబై జట్టు అనేకసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా అవతరించిందని.. జాతీయ మీడియా ప్రసారం చేసిన కథనాలలో ప్రముఖంగా ప్రస్తావించింది.