Glenn Phillips: “బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుతున్నారు” కేజీఎఫ్ -1 లో ఈ డైలాగు గుర్తుంది కదా.. ఇది ఐపీఎల్ లో అచ్చుగుద్దినట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సరిపోతుంది. ఈ సీజన్ లో మయాంక్ అగర్వాల్ అనే బ్యాటర్ రెండు మ్యాచ్ లలో ఓపెనర్ గా విఫలమయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు అతన్ని పక్కన పెట్టింది. ఆ తర్వాత అతడి స్థానంలో హెడ్ కు అవకాశం ఇచ్చింది. అతడు, అభిషేక్ శర్మ తో కలిసి హైదరాబాద్ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు.. ముంబై, బెంగళూరు పై హైదరాబాద్ 277, 287 రన్స్ చేసింది అంటే దానికి కారణం హెడ్, అభిషేక్ శర్మే. హైదరాబాద్ జుట్టు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల.. ఐపీఎల్ లో ఆ టీం ముఖచిత్రమే మారిపోయింది. మరి అలాంటి జట్టు మార్క్రం అనే ఆటగాడి విషయంలో ఎందుకు ఉదారత చూపుతోందో అర్థం కాని విషయం.
ఇటీవల రాజస్థాన్ జట్టుతో హైదరాబాద్ క్వాలిఫైయర్ -2 మ్యాచ్ ఆడింది.. కీలక వికెట్లను వెంట వెంటనే కోల్పోవడంతో.. మార్క్రం క్రీజ్ లోకి వచ్చాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయంలో.. ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఇతడు మాత్రమే కాదు అబ్దుల్ సమద్ కూడా.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. దీనివల్ల హైదరాబాద్ భారీ స్కోర్ చేయలేక పోయింది. క్లాసెన్ అర్థ సెంచరీ చేసాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే హైదరాబాద్ కథ వేరే విధంగా ఉండేది. కానీ ఇదే సమయంలో హైదరాబాద్ మేనేజ్మెంట్ పెద్ద తప్పు చేసింది. ఎందుకంటే అబ్దుల్ సమద్, మార్క్రం కంటే కూడా మెరుగైన ఆటగాడు ఆ జట్టు వద్ద ఉన్నాడు. కానీ ఎందుకనో అతడికి అవకాశాలు ఇవ్వకుండా రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేసింది. లీగ్ దశ నుంచి, క్వాలిఫైయర్ -2 వరకు అతడికి ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఫైనల్ చేరి, బలమైన కోల్ కతా ను ఢీకొడుతున్న నేపథ్యంలో.. ఇప్పటికైనా అవకాశం ఇస్తుందా? అని హైదరాబాద్ అభిమానులు ఆ జట్టు మేనేజ్మెంట్ ను ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ చేతిలో గ్లేన్ ఫిలిప్స్ అనే విధ్వంసకరమైన ఆటగాడు ఉన్నాడు. న్యూజిలాండ్ జట్టుకు చెందిన ఈ ఆటగాడు సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడంలో దిట్ట. బౌలింగ్ కూడా చేయగలడు. మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేస్తాడు. అయితే అటువంటి ఆటగాడిని పక్కనపెట్టి.. ఎటువంటి ప్రభావం చూపించని మార్క్రం, అబ్దుల్ సమద్, వంటి వారికి హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ అవకాశాలు ఇవ్వడం పట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కోల్ కతా జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్లో ఒకవేళ హైదరాబాద్ ఓపెనర్లు విఫలమైతే.. కచ్చితంగా మిడిల్ ఆర్డర్ సత్తా చాటాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మార్క్రం, అబ్దుల్ సమద్ వంటి వారితో ఉపయోగం ఉండదని.. కచ్చితంగా ఫిలిప్స్ కు అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో ఫిలిప్స్ కు అవకాశం లభిస్తుందో? లేదో? వేచి చూడాల్సి ఉంది.