Venkataramana Reddy: ఒకప్పుడు వార్తాపత్రికలు సమాజంలో ఉన్న సమస్యలను వెలుగులోకి తెచ్చేవి. రాజకీయాలకు అతీతంగా వార్తలను ప్రచురించేవి. వాస్తవాలను మాత్రమే ప్రజలకు అందించేవి. కానీ రాను రాను మీడియాలోకి వ్యాపారులు, ఇతర సంస్థలకు చెందిన వ్యక్తులు రావడంతో వార్తాపత్రికలు విశ్వసనీయతను కోల్పోయాయి.. ఫలితంగా ప్రజల చేతుల్లో చులకన అయిపోతున్నాయి. ఫక్తు వ్యాపార వస్తువుగా మారిపోయాయి. దీంతో వార్తాపత్రికలు అంటేనే జనం నమ్మని పరిస్థితి ఏర్పడింది. ఇక తెలుగునాట పార్టీలవారీగా వార్తాపత్రికలు విడిపోయాయి. భారత రాష్ట్ర సమితికి నమస్తే తెలంగాణ, కాంగ్రెస్ పార్టీకి అంశాల వారీగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీలో జగన్ కు సాక్షి, టిడిపికి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు డప్పు కొడుతుంటాయి. జగన్ విషయంలో సాక్షి ఎప్పుడూ దాపరికం ప్రదర్శించదు. పైగా తన మాస్టర్ హెడ్ పక్కనే వైయస్ బొమ్మ ముద్రిస్తూ ఉంటుంది.. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి న్యూట్రల్ ముసుగులో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తుంటాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి ఈనాడు, ఆంధ్రజ్యోతి అవుట్ రైట్ గా సపోర్ట్ చేశాయి. ఆ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినప్పటికీ.. ఇప్పటికీ అక్కడ మీడియా మధ్య యుద్ధం సాగుతూనే ఉంది.
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందనే ముద్రపడిన ఆంధ్రజ్యోతి అనుబంధ ఛానల్ ఏబీఎన్ లో “ద డిబేట్” పేరుతో ఓ చర్చా వేదిక నిర్వహించారు. వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చర్చా వేదికలో టిడిపి నాయకుడు వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాక్షి పత్రిక మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ” సాక్షి దినపత్రిక చైర్ పర్సన్ వైఎస్ భారతి ఇటీవల ఓ వేదికలో సత్యమేవ జయతే అని మాట్లాడారు. కానీ ఆ పత్రికలో ప్రతిరోజు ఒకే ఒక్క నిజమైన వార్త ప్రచురితమవుతుంది. ఆ పత్రికలో ఈరోజు చికెన్ ధరలు, గుడ్డు ధరలు, బంగారం ధరలు మాత్రమే నిజం. 12 కోడి గుడ్ల ధర 72 రూపాయలు అనేది మాత్రమే వాస్తవం. ఆ పత్రిక నాది కాదని జగన్ మోహన్ రెడ్డి అంటారు. అది ఎంతవరకు నిజమో వారికే తెలియాలి. ధరల విషయం మినహా, సాక్షిలో ప్రచురించేవన్నీ అబద్ధమని” వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆ చర్చ వేదికలో పాల్గొన్న మిగతా వారంతా విరగబడి నవ్వారు. సరే ఇది నిజమే అనుకుంటే.. వెంకటరమణారెడ్డి చర్చా వేదికలో పాల్గొన్న ఏబీఎన్ ఛానల్ చెప్పేవి మొత్తం నిజాలేనా? ప్రసారం చేసేవన్నీ వాస్తవాలేనా? పార్టీల వారీగా మీడియా విడిపోయిన తర్వాత.. నిజాలకు, అబద్దాలకు తావులేదు. సింపుల్ గా చెప్పాలంటే గోబెల్స్ ప్రచారం.. “నేను ఏదో ఒక రూపంలో నీ మీద బురద జల్లుతాను. ఆ తర్వాత కడుక్కోవడం నీ కర్మ” అన్నట్టుగా సాగుతోంది మీడియా యవ్వారం. ఇందులో ఏవి కూడా సుద్దపూసలు కావు.. అన్ని పార్టీల రంగులు పూసుకున్నవే. కాకపోతే జనాలను వెర్రి వాళ్ళను చేయడానికి రకరకాల ముసుగులు వేసుకుంటాయి.
సాక్షి మీద ఆ స్థాయిలో వ్యతిరేక ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి మాత్రం ఎన్నికల్లో ఏం తక్కువ తిన్నది.. ఈనాడు స్థాయిలో కాకున్నా.. తన పరిధి దాటి వార్తలు రాసింది. చంద్రబాబును అడ్డగోలుగా ప్రమోట్ చేసింది. చివరికి జగన్ వ్యక్తిగత విషయాలను కూడా వార్తాంశాలుగా ప్రసారం చేసింది. ప్రచురించిందీ. మరి దీనిపై వెంకట రమణారెడ్డి మాట్లాడగలరా? వెంకటకృష్ణ వ్యాఖ్యలు చేయగలరా? వెబ్ కాస్టింగ్ హైజాక్ అని సాక్షి రాస్తే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం లను ధ్వంసం చేశారని.. ఇది ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతి అని ఆంధ్రజ్యోతి రాసింది.. ఇలా ఎవరి కోణంలో వారు రాస్తున్నారు. వారి ప్రయోజనాలకనుగుణంగా డప్పులు కొడుతున్నారు.. అంతిమంగా ఆ వార్తలను చదివిన ప్రజలు వెర్రి వాళ్ళవుతున్నారు. అంతే.. అంతకుమించి ఏమీ లేదు.