Nitish Reddy : నితీష్ రెడ్డి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో ఆకట్టుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్ పురస్కారం దక్కించుకున్నాడు. నితీష్ రెడ్డి ఆట తీరు బీసీసీఐ సెలెక్టర్లను ఆకట్టుకుంది. దీంతో వారు అతడిని జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేశారు. ఈ క్రమంలో టీమిండియా టి20 జట్టుకు ఎంపికైన తొలి ఆంధ్రా ఆటగాడిగా నితీష్ రెడ్డి ఘనత సృష్టించాడు. దీంతో అతడి జాతకం మారిపోతుందని.. టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని అందరూ భావించారు. కానీ ఇంతలోనే అనుకోని పరిణామం అతడిని జట్టుకు దూరం చేసింది.
నితీష్ రెడ్డి ఇటీవల ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం బీసీసీఐ వైద్య బృందం తమ పర్యవేక్షణలో ఉంచుకుంది. అతడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జింబాబ్వే పర్యటనకు వెళ్లే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా అతని స్థానాన్ని ముంబై పేస్ ఆల్ రౌండర్ శివం దూబే తో భర్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది..
నితీష్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో అతడు రాణించగలడు.. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టులో ఆడిన అతడు.. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.. ముఖ్యంగా లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. అతని ఆట తీరు ఆకట్టుకుందని అప్పట్లోనే సీనియర్ ఆటగాళ్లు కితాబిచ్చారు.
జింబాబ్వే తో టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇస్తోంది. గత కొంతకాలంగా తీరికలేని క్రికెట్ ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి.. యువ ఆటగాళ్లకు జింబాబ్వే టూర్లో బీసీసీఐ అవకాశం కల్పించింది.. యువ జట్టుకు గిల్ నాయకత్వం వహిస్తాడు. జూలై 6 నుంచి టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతుంది.. హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి.
జింబాబ్వే టూర్ లో పాల్గొనే భారత జట్టు ఇదే
గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు సాంసన్, ధృవ్ జూరెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే, శివం దూబే.