Pakistan cricket : న్యూజిలాండ్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది. కొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉన్న సమయంలో అర్ధంతరంగా పర్యటన రద్దు చేసుకొని, స్వదేశానికి తిరిగి వెళ్లిపోయింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయమై న్యూజిలాండ్ ప్రధాని జసెండా అర్డెన్ తో ఫోన్లో మాట్లాడి, సిరీస్ కొనసాగించే ప్రయత్నం చేశారు. కానీ.. సాధ్యం కాలేదు. దీంతో.. ఉక్రోషం ఆపుకోలేకపోతున్న పాకిస్తాన్ ఆటగాళ్లు.. మాజీ క్రీడాకారులు న్యూజిలాండ్(New Zealand) ను నిందిస్తున్నారు. ఇలా వెళ్లిపోవడం సమంజసం కాదని అంటున్నారు.
అయితే.. పాకిస్తాన్ కు ఇక్కడ ఎదురయ్యే మొదటి ప్రశ్న ఏమంటే.. ‘‘ప్రాణాలు పోగొట్టుకోవాలని ఎవరు కోరుకుంటారు?’’ అవును.. ప్రాణం మీద తీపి ఎవరికి ఉండదు? ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా న్యూజిలాండ్ ఆటగాళ్లు ఎలా ఆడతారు? ఈ విషయం కూడా పాక్ ఆటగాళ్లకు తెలియదా? మీ దేశ క్రికెట్ కోసం ఇతర దేశాల ఆటగాళ్లు ప్రాణాలు పణంగా పెట్టాలా? అనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగానే జరుగుతోంది.
న్యూజిలాండ్ ఆటగాళ్లు భయపడడానికి కారణం లేకపోలేదు. 2009 మార్చి 3న పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు పంజా విసిరారు. విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. శ్రీలంక బృందం మైదానానికి వెళ్తున్న బస్సుపై తూటాల వర్షం కురిపించారు. అదృష్టవశాత్తూ ఆటగాళ్ల ప్రాణాలు పోలేదు కానీ.. కెప్టెన్ మహేల జయవర్దనే సహా కుమార సంగక్కర, అజంతా మెండిస్, సమరవీర, తరంగ పర్వితరాన గాయపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆరుగురు చనిపోయారు. ఇద్దరు పాక్ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఉగ్రదాడి ప్రపంచంలో ఎక్కడా.. ఏ క్రీడా జట్టుపైనా జరగలేదు.
అంతేకాదు.. 2002లో ఇదే న్యూజిలాండ్ జట్టు, పాక్ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ఉగ్రవాదులు(Terrorists) దాడికి యత్నించారు. కరాచీలోని షెరటాన్ హోటల్ లో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఉన్న సమయంలోనే.. హోటల్ బయట బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఫ్రెంచ్ ఇంజనీర్లు పది మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. అప్పుడు అర్ధంతరంగా పర్యటన రద్దు చేసుకొని వెళ్లిపోయింది న్యూజిలాండ్.
ఇలాంటి చేదు జ్ఞాపకం ఉన్న న్యూజిలాండ్ ను.. ఇప్పుడు ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా.. క్రికెట్ ఆడాలని పట్టుబట్టడంలో అర్థం ఉందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. పర్యటన రద్దు చేసుకొని వెళ్లిన న్యూజిలాండ్ ఆటగాళ్లపై విమర్శలు చేయడం సహేతుకమేనా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఉగ్రవాద పాములకు పాకిస్తాన్ పాలు పోసి పెంచుతున్న వైనం వీరికి తెలియదా..? అని నిలదీస్తున్నారు. భారత్ వంటి దేశాలపై దాడుల కోసం ఉగ్రవాదులను పెంచిన పాకిస్తాన్.. ఇప్పుడు అదే ఉగ్రపాముల కాటుకు గురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరు తీసిన గోతిలో వారే పడతారనే మాట.. పాకిస్తాన్ కు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు.