Virat Kohli: విరాట్ కోహ్లి.. భారత క్రికెట్ దిగ్గజం. అభిమానులు కింగ్‌గా పిలుచుకునే కోహ్లి లేకుండా భారత క్రికెట్ జట్టు ఓ సిరీస్ ఆడడం పదేళ్లలో ఇదే తొలిసారి. విశ్రాంతి కోసం ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండే కోహ్లి ఇంగ్లండ్ టూర్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో కోహ్లికి ఏమైంది.. ఎందుకు దూరంగా ఉన్నాడు అన్న ప్రశ్న అభిమానుల మదిని తొలస్తోంది. దీనికి ఎక్కడా సమాధానం దొరకడం లేదు. దక్షిణాఫ్రికా ఆగటాడు ఏబీ.డివీలియర్స్ మొదట సమాధానం చెప్పినా.. అది తప్పని రెండు రోజులకే ఉపసంహరించుకున్నాడు.
19 ఏళ్ల వయసులో ఎంట్రీ..
అండర్ – 19 జట్టుకు సారథ్యం వహించి జట్టును విశ్వవిజేతగా నిలిపిన కోహ్లీ తర్వాత భారత మెయిన్ జట్టుకు 19 ఏళ్ల వయసులోనే ఎంపికయ్యాడు. వన్డేలతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లకు టెస్టుల్లోనూ అడుగు పెట్టాడు. అప్పటి నుంచి 13 ఏళ్లుగా ఒక్కసారి కూడా స్వదేశంలో టెస్టు సిరీస్‌కు దూరం కాలేదు. కెప్టెన్‌గా జట్టును విజయపథాన నడిపించాడు. పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్నాడు. కానీ సడెన్‌గా పరుగుల యంత్రం ఆగిపోయింది. విరాట్ ప్రయాణానికి విరామం వచ్చింది. దీంతో కోహ్లీ ఎక్కడున్నాడు.. ఎందుకు టెస్ట్ సిరీస్ ఆడడం లేదు. ఏం చేస్తున్నాడు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎన్నో ఊహాగానాలు..
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు 14 నెలలు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది మళ్లీ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. స్వదేశంలో కీలకమైన ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కచ్చితంగా ఆడతాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే తొలి టెస్టు కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. కానీ సడెన్‌గా మ్యాచ్ ఆరంభానికి ముందే వెళ్లిపోయాడు. తొలి రెండు టెస్టులకు అతను అందుబాటులో లేడని బీసీసీఐ ప్రకటించింది. మూడో టెస్టు నుంచి అయినా ఆడతాడేమో అభిమానులు ఆశించారు. కానీ, వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రతిష్టాత్మకమైన ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడంటే వ్యక్తిగత జీవితంలో ఏదో జరుగుతోందన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మొదట అతని తల్లికి అనారోగ్యమనే వార్తలు వచ్చాయి. కానీ వాటిని కోహ్లి సోదరుడు ఖండించాడు. తర్వాత కోహ్లి రెండోసారి తండ్రి కాబోతున్నాడని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివీలియర్స్ వెల్లడించారు. కానీ, అది కూడా తప్పని తర్వాత ప్రకటించాడు. దీంతో అభిమానుల్లో మళ్లీ ఆందోళన మొదైలంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే స్వదేశంలో టెస్టు సిరీస్‌కు దూరమయ్యేంత ఇబ్బంది కోహ్లికి ఏమొచ్చింది అన్న ప్రశ్నే అభిమానులను టెన్షన్ పెడతోంది. టెస్టు క్రికెట్‌ను ఇష్టపడే కోహ్లి ఇంగ్లండ్ సిరీస్‌లో లేకపోవడం ప్రపంచ క్రికెట్‌కు దెబ్బ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. అండర్సన్, కోహ్లిని చూసే ఛాన్స్ మిస్ అయ్యామని టీమిండియా మాజీ ఆటగాడు, కామెంటేటర ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.