T20 World Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో సూపర్ – మ్యాచ్ లు ముగిశాయి. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు ఇంటికి వెళ్ళాయి. ఆస్ట్రేలియా జట్టు టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలు కావడంతో నిరాశతో నిష్క్రమించాల్సి వచ్చింది. మరోవైపు ఈ టోర్నీలో అప్రతిహత విజయాలు సాధించిన టీమిండియా గ్రూప్ -1 లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇదే గ్రూప్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ రెండో స్థానం ఆక్రమించింది. గ్రూప్ -2 లో దక్షిణాఫ్రికా మొదటి స్థానం, ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలిచాయి. దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తో జూన్ 27న ట్రిని డాడ్ వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ వెళుతుంది. అదే రోజు రాత్రి (భారత కాలమానం ప్రకారం) టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో తలపడతాయి.
2022 t20 వరల్డ్ కప్ లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ – భారత్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ పై ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈసారి ఎలాగైనా ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై భారత్ విజయం సాధించినప్పటికీ.. ఆటగాళ్లలో కసి ఇంకా తీరలేదు. ఎలాగైనా సరే ఇంగ్లాండ్ పై గెలిచి.. ఫైనల్ వెళ్లాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇప్పటికే జట్టు ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు.. గత వరల్డ్ కప్ లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని కసి మీద ఉన్నారు..
అయితే ఇంగ్లాండ్ తో జరిగే ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే అనేది లేదు. ఇందు కారణం సమయభావమే. ఇండియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య వెస్టిండీస్ కాలమానం ప్రకారం జూన్ 27 ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ మొదలు కావాల్సి ఉంది.. ఇక్కడి టైమింగ్స్ ప్రకారం ఆ మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత జూన్ 29 ఉదయం 10:30 నిమిషాలకు (వెస్టిండీస్ కాలమాన ప్రకారం) ఫైనల్ మ్యాచ్ మొదలవుతుంది. అంటే ఈ ప్రకారం రెండవ సెమీఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే కనుక కేటాయిస్తే, ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఆటగాళ్లకు 24 గంటల సమయం కూడా లభించదు. ఈ నేపథ్యంలో రిజర్వ్ డే కేటాయించకుండా 250 నిమిషాల అదనపు సమయాన్ని ఐసీసీ కేటాయించింది.. ఒకవేళ వర్షం కురిస్తే.. అంపైర్ల నిర్ణయం ప్రకారం మ్యాచ్ నిర్వహిస్తారు.. మైదానం మరీ చిత్తడిగా ఉంటే ఓవర్లను కుదిస్తారు. లక్ష్యాన్ని కూడా డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం నిర్ణయిస్తారు. మంగళవారం ఆఫ్ఘనిస్తాన్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు పదేపదే వర్షం ఆటంకం కలిగించడంతో.. అంపైర్లు డక్ వర్త్ లూయిస్ విధానాన్ని అమలు చేశారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. బంగ్లాదేశ్ పై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది..