Afghanistan: వారు ఆటను ప్రేమిస్తారు.. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటారు.. వీడియో వైరల్..

ముఖ్యంగా మంగళవారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. అన్ని రంగాలలో సమష్టి ప్రదర్శన చేసి, బంగ్లాదేశ్ జట్టును ఓడించింది. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ.. బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. 115 పరుగులు సాధించింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 26, 2024 1:29 pm

Afghanistan

Follow us on

Afghanistan: టి20 వరల్డ్ కప్ కు ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఎంపిక చేసినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. ఈ జట్టు కనీసం ఒక్క మ్యాచ్ లో అయినా గెలుస్తుందా అని గేలి చేశారు. పసికూన జట్టు అంటూ నొసలు చిట్లించారు. అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు భయపడలేదు.. ధైర్యాన్ని సడలనివ్వలేదు. నవ్వినా నాప చేనే పండుతుందనే సామెతను ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు తమ ఆటతీరుతో నిజం చేసి చూపించారు. లీగ్ దశలో బలమైన న్యూజిలాండ్ జట్టును ఓడించారు. సూపర్ -8 దశలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించారు. సెమీస్ వెళ్లాలనుకునే స్థితిలో.. గెలిచి తీరాల్సిన పరిస్థితిలో.. బంగ్లాదేశ్ జట్టుపై 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని దక్కించుకున్నారు. టి20 వరల్డ్ కప్ లో తొలిసారి సెమీస్ కు వెళ్లారు. తొలి సెమీస్ మ్యాచ్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో తలపడనున్నారు.

ముఖ్యంగా మంగళవారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. అన్ని రంగాలలో సమష్టి ప్రదర్శన చేసి, బంగ్లాదేశ్ జట్టును ఓడించింది. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ.. బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. 115 పరుగులు సాధించింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకుంది.. కెప్టెన్ రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి, బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు.. చివరి ఓవర్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలుపునకు రెండు వికెట్లు కావలసిన స్థితిలో.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు..

ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ వెళ్ళింది.. బంగ్లాదేశ్ తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజయం సాధించిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రషీద్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యాడు. మిగతా ఆటగాళ్లు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మైదానంలో నృత్యాలు చేశారు. ఆప్ఘన్ సంప్రదాయ పాటలు పాడుతూ మైదానంలో కేరింతలు కొట్టారు.. ఈ వీడియోను ఐసీసీ తన అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాలలో పోస్ట్ చేసింది.. ఇది మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదు చేసుకున్నాయి. “వారు ఆటను ప్రేమిస్తారు. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. అందుకు సజీవ దృశ్యమే ఈ వీడియో. అది కళ్ళముందు అద్భుతంగా కనిపిస్తోందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.