Pandya Brothers: ఒకటి కాదు రెండు కాదు.. రూ.4.3 కోట్లు.. సోదరుడిపైనే కేసు పెట్టిన పాండ్యా బ్రదర్స్

హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాకు వైభవ్ పాండ్యా అనే వ్యక్తి వరుసకు సోదరుడవుతాడు. వీరు ముగ్గురు కలిసి 2021లో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో హార్దిక్, కృణాల్ 40% చొప్పున పెట్టుబడులు పెట్టారు. ఇందులో వైభవ్ కు 20% వాటా ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 11, 2024 2:24 pm

Pandya Brothers

Follow us on

Pandya Brothers: ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కు కాలం కలిసి రావడం లేదు.. ఇటీవల ముంబై జట్టుకు కెప్టెన్ అయిన నాటి నుంచి అతడు వరుసగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సోషల్ మీడియాలో ట్రోల్స్ భరిస్తున్నాడు.. ఇటీవల తను సారథ్యం వహిస్తున్న ముంబై జట్టు ఢిల్లీ మీద గెలిచినప్పటికీ అతడిపై ఒత్తిడి ఇంకా తగ్గలేదు. తన కెప్టెన్సీ పై కత్తి వేలాడుతూనే ఉంది. ఇది ఇలా ఉండగానే తనకు వరుసయ్యే సోదరుడు మోసం చేయడంతో హార్దిక్ పాండ్యా నిండా మునిగాడు. అతడు మాత్రమే కాదు అతడి సొంత సోదరుడు కృణాల్ పాండ్యా కూడా మోసపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాకు వైభవ్ పాండ్యా అనే వ్యక్తి వరుసకు సోదరుడవుతాడు. వీరు ముగ్గురు కలిసి 2021లో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో హార్దిక్, కృణాల్ 40% చొప్పున పెట్టుబడులు పెట్టారు. ఇందులో వైభవ్ కు 20% వాటా ఉంది. వారిద్దరూ క్రికెటర్లు కావడంతో.. బిజీగా ఉండడంతో.. వైభవ్ ఈ వ్యాపారాన్ని చూసుకునేవాడు. వరుసకు సోదరుడు కావడంతో హార్దిక్ పాండ్యా సోదరులు వైభవ్ పాండ్యా ను పూర్తిగా నమ్మారు. మొదట్లో ఈ వ్యాపారం లాభసాటిగా సాగింది. మొదట్లో దండిగా లాభాలు వచ్చాయి. పెట్టుబడులు ఎలా అయితే పెట్టారో.. అదే నిష్పత్తిలో లాభాలు పంచుకున్నారు. ఇలా సాగుతుండగానే వైభవ్ సరికొత్త మోసానికి తెరలేపాడు. పాండ్యా సోదరులను మోసం చేశాడు. ఈ వ్యవహారంలో 4.3 కోట్ల మేర వారికి వైభవ్ పాండ్యా కుచ్చుటోపి పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై హార్దిక్, కృణాల్ ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు వైభవ్ ను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

మొదట్లో లాభసాటిగా ఈ వ్యాపారం సాగిన నేపథ్యంలో.. దురాశ పుట్టిన వైభవ్.. హార్దిక్ పాండ్యా సోదరులకు తెలియకుండా మరో పాలిమర్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ముగ్గురి భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన పాలిమర్ వ్యాపారాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో అందులో నష్టాలు రావడం మొదలయ్యాయి. ఇలా 3 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో వైభవ్ రహస్యంగా ముగ్గురి భాగస్వామ్యంలో ఉన్న పాలిమర్ సంస్థ నుంచి ఆ కాస్త నగదును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. అలా దాదాపు 4.3 కోట్ల మేర మోసం చేశాడు. ఈ విషయంపై హార్దిక్ పాండ్యా సోదరులు వైభవ్ పాండ్యాను నిలదీయగా.. అతడు బెదిరింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వమంటే.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. పైగా దూషణలకు దిగాడు. దీంతో హార్దిక్, కృణాల్ సోదరులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు వైభవ్ ను అరెస్టు చేశారు. ఈ కేసు పై హార్దిక్ పాండ్యా సోదరులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. హార్దిక్ పాండ్యా ను మోసం చేయడంతో వైభవ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. వాస్తవానికి హార్దిక్ పాండ్యా సోదరులది దిగువ మధ్యతరగతి కుటుంబం. జాతీయ జట్టులోకి ప్రవేశించిన తర్వాతే వారి ఆర్థిక పరిస్థితి మారిపోయింది. అలా పైసా, పైసా కూడపెట్టి వరుసకు సోదరుడయ్యే వ్యక్తి చేతిలో పెడితే.. చివరికి అతడు కుచ్చుటోపి పెట్టాడు.