Tesla India: భారత్‌లో టెస్లా కార్ల తయారీ ప్లాంటు పెట్టాలన్న ఆ కంపెనీ చైర్మన్ ఎలాన్ మస్క్ కల త్వరలోనే నెరవేరబోతోంది. అనేక ప్రయత్నాల తర్వాత టెస్లాను భారత్‌లోకి అనుమతి లభించింది. ఈమేరకు తుది దశ చర్చలు జరిపేందుకు ఆ సంస్థ చైర్మన్ మస్క్ ఈనెల 22న భారత్‌కు రాబోతున్నారు. ప్రధాని మోదీతో సమావేశమై చర్చించే అవకాశం ఉంది. ఈ సందరభంగా అధికారికంగా తమ కంపెనీ పెట్టుబడుల ప్రణాళిక ప్రకటించే ఛాన్స్ ఉంది. మస్క్ పర్యటనను కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే ధ్రువీకరించారు.
కొత్త పాలసీ నేపథ్యంలో..
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు భారత్ ఇటీవల కొత్త పాలసీని ప్రకటించింది. పాత పాలసీలో సవరణలు చేసింది. ఈ నేపథ్యంలో మస్క్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దీని ప్రకారం భారత్‌లో కనీసం 500 మిలియన్ డాలర్లతో టెస్లా కార్ల తయారీ ప్లాంటు నెలకొల్పే కంపెనీలకు తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం పూర్తిగా తయారైన కారును దిగుమతి చేసుకుంటే 70 శాతం నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ సుంకాలు విధిస్తోంది. ఇదే భారత్‌లోకి టెస్లా ఎంట్రీకి అవరోధంగా మారింది.
విదేశీ కంపనీల ఒత్తిడితో..
భారత్ కస్టమ్స్ సుంకాలు తగ్గించాలని విదేశీ కంపెనీలు చాలాకాలంగా భారత్‌పై ఒత్తిడి చేస్తున్నాయి. ఇందులో టెస్లా కూడా ఉంది. ఈ క్రమంలోనే భారత్ దేశీయంగా తయారీతో ముడిపెట్టి పాలసీని సవరించింది. దీంతో భారత్‌లో పెట్టుబడి పెట్టే కంపెనీలకే సుంకంలో తగ్గింపు వర్తించనుంది. తాజాగా సవరించిన పాలసీతోనే మస్క్ భారత్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది.
గతేడాది అమెరికాలో చర్చలు..
ఇదిలా ఉండగా ప్రధాని మోదీతో మస్క్ గతేడాది అమెరికాలో చర్చలు జరిపారు. భారత మార్కెట్‌లోకి టెస్లా ఎంట్రీకి సంబంధించి 2024లో తాను వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో భారత్ పాలసీలో సవరణ చేయడంతో మస్క్ టూర్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.