PM Modi US Tour : ఉగ్రవాదాన్నిప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు ప్రధాని మోదీ గట్టి హెచ్చరికలే పంపారు. దశాబ్దాలు గడుస్తున్నా ఉగ్రవాదం ఇప్పటికీ ప్రమాదకరంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా కాంగ్రెస్ సమావేశాల్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. దయాది దేశం పాకిస్తాన్ కు స్పష్టమైన హెచ్చరికలు పంపారు. ప్రపంచలో అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థంగా భారత్ మారబోతోందని గుర్తుచేశారు. 9/11, 26/11 దాడుల గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదం, దాని పర్యవసానాలు గురించి వివరించారు. ప్రధాని ప్రసంగానికి సభికులు కరతాళ ధ్వనులతో తమ అభినందనలు తెలిపారు.
అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభిస్తోంది. అక్కడి ప్రవాస భారతీయులు మోదీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. జాతీయ జెండాలను చేతబట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అటు వైట్ హౌస్ లో మోదీకి ఆత్మయ సత్కారం లభించింది. అధ్యక్షుడు జో బైడన్ తో దైపాక్షిక చర్చలు సానుకూలంగా సాగాయి. భద్రత, రక్షణ రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా దేశీయ జెట్ ఇంజన్ల ఉత్పత్తిపై నిర్ణయం జరిగింది. ప్రధాని మోదీ గౌరవార్థం అధ్యక్షుడు జోబైడన్ వైట్ హౌస్ లో ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. పసందైన వంటకాలతో ప్రత్యేక అతిథి మర్యాదలు చేశారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.
అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని మోదీ రెండోసారి ప్రసంగించారు. ఉగ్రవాదం విషయంలో ప్రపంచ దేశాలు ఉపేక్షించకూడదన్నారు. పరోక్షంగా చైనాపై వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సూత్రాలు, నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. వివాదాలు శాంతియుతంగా పరిష్కరించడం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవడం అన్ని దేశాల బాధ్యతగా గుర్తుచేశారు. అప్పుడే గ్లోబర్ ఆర్డర్ అనేది అమలవుతుందన్న విషయం గుర్తెరగాలని పరోక్షంగా చైనా గురించి ప్రస్తావించారు.
భారత్ ప్రపంచహిత దేశమని గుర్తుచేశారు. భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచమే అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను మొదటిసారిగా అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానంలో ఉందన్నారు. త్వరలో మూడోస్థానానికి ఎగబాకనుందని చెప్పారు. ప్రపంచ అభివృద్ధికి అమెరికా,భారత్ కలిసి నడవాల్సి ఉందన్నారు. అమెరికాలో విద్యావనరులు ఉంటే.. భారత్ లో అపారమైన యువశక్తి ఉందన్నారు. ఈ రెండూ కలిస్తేనే సుస్థిర సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దీనికి అమెరికా దిగ్గజాలు సైతం తమ కరతాళ ధ్వనులతో బలపరిచారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని అభినందించారు.