ధోనీ టీంకు ఏమైంది..?

ఏమైందో ఏమో కానీ.. ఈ మధ్య ధోనీ టీంకు ఏదీ కలిసిరావడం లేదు. ఆ జట్టు ప్లేయర్స్‌ను అటు గాయాలు.. ఇటు ఫిట్‌నెస్‌ వేధిస్తూనే ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేజేతులా ఓడింది. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 157 పరుగుల వద్దే ఆగిపోయి అభిమానులను నిరాశపర్చింది. పది ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 99 రన్స్ చేసిన సూపర్ కింగ్స్.. సెకండాఫ్‌లో 69 పరుగులు చేయలేకపోయింది. […]

Written By: NARESH, Updated On : October 8, 2020 12:17 pm
Follow us on

ఏమైందో ఏమో కానీ.. ఈ మధ్య ధోనీ టీంకు ఏదీ కలిసిరావడం లేదు. ఆ జట్టు ప్లేయర్స్‌ను అటు గాయాలు.. ఇటు ఫిట్‌నెస్‌ వేధిస్తూనే ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేజేతులా ఓడింది. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 157 పరుగుల వద్దే ఆగిపోయి అభిమానులను నిరాశపర్చింది. పది ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 99 రన్స్ చేసిన సూపర్ కింగ్స్.. సెకండాఫ్‌లో 69 పరుగులు చేయలేకపోయింది. ఈ పది ఓవర్లలోనే కోల్‌కతా బౌలర్లు కథ మొత్తాన్ని మార్చేశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన కో‌ల్‌కతా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకోగా.. చెన్నై ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో ఉంది.

Also Read: ఐపీఎల్ జట్లలో ఆటగాళ్లు మారిపోనున్నారా?

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 179 పరుగుల లక్ష్యాన్ని పది వికెట్ల తేడాతో గెలిచిన చెన్నై.. ఈ మ్యాచ్‌ను సైతం తేలిగ్గా గెలుస్తుందని భావించారంతా. కానీ ఊహించని రీతిలో ధోనీ సేన ఓడింది. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన భారీ మార్పులు జట్టు ఓటమికి దారి తీశాయి. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ ఒక్క ఫోర్ మాత్రమే కొట్టి.. 12 బంతుల్లో 11 రన్స్ చేసి ఔటయ్యాడు. ధోనీ తర్వాత సామ్ కరన్ బ్యాటింగ్‌కు రాగా… ఆ తర్వాత డ్వేన్ బ్రావో బ్యాటింగ్‌కు దిగకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

ఈ సీజన్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న కేదార్ జాదవ్‌ను చెన్నై ముందుగా బ్యాటింగ్‌కు దింపి మూల్యం చెల్లించుకుంది. చెన్నై విజయానికి 21 బంతుల్లో 39 రన్స్ అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్.. డాట్ బాల్స్‌తో జట్టు ఓటమికి కారణమయ్యాడు. 12 బంతులు ఆడిన జాదవ్ 7 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఒక్కటంటే ఒక్క ఫోర్ మాత్రమే కొట్టాడు. జాదవ్ మరో రెండు బౌండరీలు బాదినా.. లేదంటే బంతిని బలంగా బాదే బ్రావో బ్యాటింగ్‌కు వచ్చినా బాగుండేది. మ్యాచ్ ముగిశాక ధోనీ మాట్లాడుతూ.. బ్రావోను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నామని అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ 17 పరుగులు చేసి ఔటయ్యాక.. రాయుడు (30), షేన్ వాట్సన్ (50) రెండో వికెట్‌కు 69 రన్స్ జోడించారు. వీరిద్దరూ రెండు పరుగుల వ్యవధిలో ఔటయ్యాక.. చెన్నై బ్యాట్స్‌‌మెన్ ఎవరూ భారీ షాట్లు ఆడలేకపోయారు. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోతున్నా.. చేతిలో బోలెడన్ని వికెట్లు ఉన్నా.. అతి జాగ్రత్తతో ఆడి ఒత్తిడి పెంచుకున్నారు.

Also Read: ఐపీఎల్‌: ఆటగాళ్లను ఆ రెండు వెంటాడుతున్నాయా?

చివరి రెండు ఓవర్లలో చెన్నై విజయానికి 36 రన్స్ అవసరమైన దశలోనూ జాదవ్ దూకుడుగా ఆడలేకపోయాడు. మరో ఎండ్‌లో ఉన్న జడేజాకు స్ట్రయికింగ్ ఇవ్వలేదు. చివరి రెండు ఓవర్లలో జాదవ్ ఆరు బంతులు ఆడి ఆరు పరుగులు మాత్రమే చేశాడు. రాయుడు, వాట్సన్ క్రీజులో ఉన్నప్పటికీ.. 10 ఓవర్ల నుంచి 15 ఓవర్ల వరకు చెన్నై ఒక్కటంటే ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. 11వ ఓవర్ నుంచి 17వ ఓవర్ పూర్తయ్యే వరకు చెన్నై బ్యాట్స్‌మెన్ కేవలం రెండు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే కొట్టారు.  కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి పది ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 93 రన్స్ చేయగా.. చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి.. తర్వాతి పది ఓవర్లలో 72 రన్స్ మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీశారు. కానీ బౌలర్ల కష్టాన్ని చెన్నై మిడిలార్డ్ వృథా చేసింది.