IPL Mega Auction 2025: ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి మెగా వేలం అందరూ ఊహించిన దానికంటే భిన్నంగా జరిగింది. అన్ని జట్లు కొత్త ఆటగాళ్లను తీసుకున్నాయి. జట్టుకు భారంగా ఉంటారనుకున్న ప్లేయర్లను మొహమాటం లేకుండా బయటికి పంపించాయి. కొందరు ఆటగాళ్ల ట్రాక్ రికార్డు బాగున్నప్పటికీ.. చిన్న చిన్న కారణాలు చూపిస్తూ వారిని వేలంలో కొనుగోలు చేయలేదు. అలాంటి వారిలో శార్దూల్ ఠాకూర్, పృథ్వీ షా ముందు వరసలో ఉన్నారు. పృథ్వీ షా ను వేలంలో ముంబై జట్టు కొనుగోలు చేయలేదు. ఇక శార్దూల్ ఠాకూర్ ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. మెగా వేలంలో తొలిరోజు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ సరికొత్త సంచలనం సృష్టించగా.. రెండో రోజు వేలంలో అమ్ముడుపోకుండా పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్ మరో సంచలనానికి నాంది పలికారు. అయితే వీరి వయసులో సగం ఉన్న సూర్యవంశీ 1.10 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. శార్దూల్ ఠాకూర్ ఢిల్లీ జట్టుతో కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాడు. అయినప్పటికీ ఈసారి వేలంలో ఢిల్లీ జట్టు ఇతడిని పట్టించుకోలేదు. దీనిపై ఢిల్లీ జట్టుకు ఒకప్పుడు కోచ్ గా పనిచేసిన రికీ పాంటింగ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ” నేను ముంబై జట్టుతో ఉన్నప్పుడు శార్దుల్ భవిష్యత్తు ఆశా కిరణం లాగా మాకు కనిపించాడు.. అప్పట్లో వేలంలో అతడికి 10 కోట్ల దాకా చెల్లించాం. 2022 మెగా వేలంలో శార్దుల్ 10.75 కోట్లు పలికాడు. ఇప్పుడు అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ఆల్ రౌండర్ ల యుటిలిటీని పూర్తిగా తగ్గించింది. అందువల్లే శార్దూల్ లాంటి ఆటగాళ్లకు డిమాండ్ లేకుండా పోయిందని” వ్యాఖ్యానించాడు. పృథ్వీ షా విషయంలోనూ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు..” పృథ్వీ షా అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాడు. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పృథ్వీ షా ఉన్నప్పటికీ ప్లే 11 లో అతనికి ఊహించినంత విధంగా అవకాశాలు రాలేదు. క్రమశిక్షణ రాహిత్యం వల్ల అతడు అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడని” పాంటింగ్ పేర్కొన్నాడు.
ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ
పృథ్వీ షా కు అద్భుతమైన ప్రతిభ ఉంది. అతడు 18 సంవత్సరాల వయసులోనే టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏకంగా సెంచరీ కూడా చేశాడు. దీంతో అతడిని భావి సచిన్ అని పేర్కొన్నారు. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు వినోద్ కాంబ్లీ లాగా మారిపోయాడు. క్రమశిక్షణ లేకపోవడం, తరచూ వివాదాలలో తల దురచడం వంటివి అతడి స్థాయిని పూర్తిగా తగ్గించాయి. ఇటీవల కాలం నుంచి అతడు ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతడిని ముంబై రంజి జట్టు నుంచి పక్కన పెట్టారు.. ” ఐపీఎల్ ఆట తీరు పూర్తిగా మారిపోయింది. కొత్తవాళ్లు వస్తున్నారు. వారు పూర్తిస్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అందువల్ల యాజమాన్యాలు కొత్తదనాన్ని కోరుకుంటున్నాయి. అలాంటప్పుడు కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు రావు. అయితే ఆ జాబితాలో పృథ్వీ షా , శార్దుల్ ఠాకూర్ ఉండడం దారుణమని” మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈసారి జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీ షా , శార్దూల్ ఠాకూర్ మాత్రమే కాకుండా కేన్ విలియంసన్, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, బెయిర్ స్టో, మయాంక్ అగర్వాల్ ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. ఇక వైభవ్ సూర్యవంశం అనే 13 సంవత్సరాల బాలుడిని రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది. అయితే అతడు ఇటీవల కాలంలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. ఐదు రంజీ మ్యాచ్లను ఆడేశాడు. తక్కువ వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన ఆటగాడిగా పేరుపొందాడు. అయితే అతడు దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో.. రాజస్థాన్ జట్టు 1.10 కోట్లకు ఓన్ చేసుకుంది. అంతేకాదు అతడిని భావి రాజస్థాన్ జట్టుకు సారథ్యం వహించే వ్యక్తిగా కీర్తిస్తోంది. . అంతేకాదు సూర్య వంశీ సత్తాముందు పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్ సరిపోరని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్లే వారిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదని చెబుతున్నారు.