Rohit Sharma: వారిద్దరి వల్లే గెలిచాం: రోహిత్ శర్మ

111 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేదించింది. సూర్య కుమార్ యాదవ్ అర్థ సెంచరీ చేశాడు. అతడికి శివం దూబే (31) తోడయ్యాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 13, 2024 11:59 am

Rohit Sharma

Follow us on

Rohit Sharma: టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సూపర్ -8 కు చేరుకుంది. హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటింది. బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్లో అమెరికాపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది, గ్రూప్ – ఏ లో మొదటి స్థానంలో నిలిచింది . ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్..పిచ్ పరిస్థితి చూసి బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి అమెరికా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ ఈ మైదానంపై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 110 పరుగులు చేశారు. నితీష్ కుమార్ 27, టేలర్ 24 పరుగులతో టాప్ స్కోరర్ లు గా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.

111 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేదించింది. సూర్య కుమార్ యాదవ్ అర్థ సెంచరీ చేశాడు. అతడికి శివం దూబే (31) తోడయ్యాడు. ఫలితంగా భారత్ పది బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ రెండు వికెట్లు, అలీ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్ విజయం అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరులతో మాట్లాడాడు.. శివం దూబే, సూర్య కుమార్ యాదవ్ ఆట తీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు.. అమెరికాలోని భారత సంతతికి చెందిన ఆటగాళ్ల ప్రదర్శన పై హర్షం వ్యక్తం చేశాడు. “ఈ మైదానంపై అది కఠినమైన లక్ష్యం. మేము ఓపికగా బ్యాటింగ్ చేశాం. సూర్య కుమార్ యాదవ్, శివం దూబే విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్లిష్ట సమయంలో ఎంతో పరిణతితో కూడిన బ్యాటింగ్ చేశారు. టీమిండియా గెలిచింది అంటే అది వారి కృషే. అమెరికా జట్టులో చాలామంది మాకు తెలుసు. వారంతా భారత మూలాలు ఉన్న ఆటగాళ్లు. వారితో గతంలో మేము ఆడాం. ఈ మైదానం బౌలర్లకు సహకరిస్తుందని తెలుసు కాబట్టే ముందుగా బౌలింగ్ ఎంచుకోవాల్సి వచ్చింది.. అర్ష్ దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. శివం దూబే బౌలింగ్ ను మేము జట్టు అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటాం. న్యూయార్క్ మైదానం కూడా పేసర్లకు అనుకూలంగా మారింది.. అందువల్లే వారితో ఎక్కువగా బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. సూపర్ -8 కు చేరుకోవడం ఆనందాన్నిస్తోందని” రోహిత్ శర్మ పేర్కొన్నాడు.