Minister Nara Lokesh: ప్రముఖుల పర్యటన సమయంలో పోలీసులు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో పడిన బాధలు వర్ణనాతీతం. అప్పటి సీఎం జగన్ నుంచి మంత్రుల వరకు పర్యటిస్తే చాలు.. వారి భద్రతకు ఏకంగా పరదాలు కట్టేవారు. జగన్ గగన తలం లో వెళ్తుంటే.. భూమిపై సైతం ట్రాఫిక్ క్లియర్ చేసేవారు. జిల్లాల పర్యటనకు వస్తే చాలు రోజుల తరబడి ఆంక్షలు విధించేవారు. రహదారులను తవ్వేసేవారు. పచ్చని చెట్లను తొలగించేవారు. కానీ అటువంటి పరిస్థితి వద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. తన పర్యటనలో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. ఇటువంటి తరుణంలో తిరుపతిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. గురువారం వేకువజామున స్వామి వారిని చంద్రబాబు కుటుంబ సభ్యులంతా దర్శించుకున్నారు. చిన్నపాటి వర్షం పడటంతో పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చంద్రబాబుతో పాటు లోకేష్ తడవకుండా ఉండేందుకు గొడుగులు సమకూర్చారు. ఈ క్రమంలో ఓ చోట పరదాలు కట్టి ఉండడం కనిపించింది. దీనిపై లోకేష్ స్పందించారు. పరదాలు కట్టవద్దని చెప్పాం కదా? ఎందుకు కట్టారంటూ ప్రశ్నించారు. అయితే పొరపాటు జరిగిందని పోలీసులు చెప్పగా.. అలవాటులో పొరపాటా అంటూ లోకేష్ నవ్వుతూ సెటైరికల్ గా మాట్లాడారు.
పోలీసులు, మీడియా ప్రతినిధులు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ సైతం వారితో ఎంతో సరదాగా మాట్లాడారు. పాత పగ చూపుతున్నారా అంటూ నవ్వుతూ అడిగారు. చాలా పనులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వచ్చేలా మాట్లాడారు. ఇకనుంచి పరదాల మాటున పర్యటనలు ఉండవని తేల్చి చెప్పారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లారు. ప్రస్తుతం తిరుమలలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.