Team India : టీమిండియా క్రికెట్ జట్టు సొంతగడ్డపై దూకుడైన ఆటతీరుతో పెద్ద పెద్ద జట్లనే చిత్తు చేసింది. సొంతగడ్డపై ఎంతటి పటిష్టమైన జట్టు అయినా భారత్ ముందు తలవంచాల్సిందే అన్నట్లు మన క్రికెటర్లు ప్రత్యర్తిని బెంబేలెత్తిస్తారు. పదునైన బౌలింగ్, ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసే బ్యాటింగ్ తీరుతో సత్తాచాటుతారు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ ఇదే ఆటతీరు కనబర్చారు. మొదటి టెస్టును ఐదు రోజుల్లో గెలిచిన టీమిండియా రెండో టెస్టు కూడా ఐదు రోజులు సాగినప్పటికీ కేవలం 173.2 ఓవర్లే రెండు జట్లు ఆడాయి. ఈ మ్యాచ్‌లో తొలి రోజు 35 ఓవర్లు ఆట సాగింది. తర్వాత రెండు రోజులు వర్షం కారణంగా ఆట సాగలేదు. ఇక నాలుగు, ఐదో రోజు సాగిన ఆటలో టీమిండియా బంగ్లా ఓటమిని శాసించింది. దూకుడైన ఆటతో అసాధ్యం అనుకున్న మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఇదే బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు ముందు పాకిస్తాన్‌లో పర్యటించింది. పాకిస్తాన్‌లోనే ఆ జట్టును చిత్తు చేసింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్‌ను కూడా బంగ్లాదేశ్ ఓడించింది. కానీ భారత గడ్డపై భారత్‌ను ఓడించలేకపోయింది. అది సాధ్యం కాదని ఆ జట్టుకు టీమిండియా మరోసారి తమ ఆటతీరుతో తెలియజేసింది.
– పాక్ క్రికెటర్ల ప్రశంసలు..
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ తర్వాత కామెంటేటర్‌గా ఉన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తారు. టీమిండియా క్రికెటర్ల దూకుడైన ఆటతీరుతో మంత్రముగ్ధుడిని అయ్యానని వెల్లడించారు. టెస్టు మ్యాచ్‌ను టీ20 తరహాలో ఆడిన రోహిత్‌సేన నిజమైన విక్టరీ హండ్ చేసిందని కొనియాడారు.. ఇందుకు కోచ్ గంభీర్‌తోపాటు, టీమిండియా క్రికెటర్లందరూ సహకరించారన్నారు. ఆల్ ఔట్ అయినా గెలిచి తీరాలన్న సంకల్పమే టీమిండియాకు విజయం అందించిందని తెలిపారు. ఇలాంటి ఆటతీరు పాకిస్తాన్‌కు సాధ్యం కావడం లేదన్నారు. అందుకే సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిందని తెలిపారు.
-ఆకాశానికెత్తిన రమీజ్ రాజా
ఇక బంగ్లాదేశ్‌పై టీమిండియా ఆటతీరును చూసిన పాక్ మరో మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా కూడా టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తారు. రోహిత్ సేనను ఆకాశానికి ఎత్తారు. ఇలాంటి ఆటతీరు, టీం నుంచి లభించే సపోర్టు టీమిండియాకే సాధ్యమవుతాయన్నారు. యువ క్రికెటర్లతో టీమిండియా ఐదారేళ్లుగా నిలకడైన ఆటతీరు కనబరుస్తోందన్నారు. పాకిస్తాన్ కూడా మూడేళ్ల క్రితం వరకు నిలకడగా రాణించిందని, కానీ, మూడేళ్లుగా జట్టు ఆటతీరు క్రమంగా తగ్గుతోందన్నారు. ఈ కారణంగానే చిన్నజట్లపై కూడా ఓటమి మూటగట్టుకుంటోందని ఆరోపించారు. టీమిండియాలో యువరక్తం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కోచ్ గంభీర్ కూడా యువకుడే కావడం ఆ జట్టుకు మరింత బలమని పేర్కొన్నారు. రోహిత్ సారథ్యంలో టీమిండియా సొంతగడ్డపైనే కాకుండా, విదేశీ గడ్డపైనా విజయాలు సాధిస్తోందన్నారు. ఇదంతా ఓవర్‌నైట్ జరుగలేదని పేర్కొన్నారు. టీం మేనేజ్‌మెంట్, కోచ్, ఆటగాళ్ల ఎంపిక, ప్రతిభ, అన్నీ సక్సెస్ సీక్రెట్ అని తెలిపారు. ఇది పాకిస్తాన్‌లో సాధ్యం కాదని తెలిపారు.
-షోయబ్ అక్తర్ అభినందన
ఇక మరో పాక్ మాజీ క్రికెటర్, సీమర్ షోయబ్ అక్తర్ కూడా టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తారు. రోహిత్ సారథ్యంలోని జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడమే కాకుండా జట్టులోని ఆటగాళ్లంతా నిలకడైన ఆటతీరుతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, మిడిలార్డర్, లోవర్ ఆడ్డర్ ఆటగాళ్లు అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటున్నారని తెలిపారు.
మొత్తంగా టీమిండియా కూడా కొత్త కోచ్ గంభీర్ నేతృత్వంలో దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి జట్టులోకి తీసుకుంటున్నారు. దేశవాళీలో బాగా రాణించిన వారినే తుది జట్టులో అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ప్రతిభగల వారు ఫెయిల్ అయినా కొనసాగిస్తున్నారు. ఈ కోవలోనే జట్టులోకి రావడమే కష్టం అనుకున్న పంత్ జట్టులోకి వచ్చి సత్తా చాటుతున్నాడు. ఆటలో విఫలమైన గిల్‌ను కొనసాగిస్తూ అతని నుంచి ఆట రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒత్తిడి లేకుండా సమష్టిగా ఆడేలా చూస్తున్నారు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచి ప్రోత్సహించడం వల్లనే ఇలాంటి ఆటతీరే టీమిండియా విజయానికి దోహదపడుతోంది. అందుకే అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు కూడా టీమిండియా ఆటతీరును ప్రశంసిస్తున్నారు.