https://oktelugu.com/

Tim Southee : భారత్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్ లో ప్రకంపనలు.. కివీస్ కు కూడా బంగ్లాదేశ్ ఫలితమే ఎదురవుతుందేమో?

24 గంటల వ్యవధిలోనే ప్రపంచ క్రికెట్ లో సంచలనాలు నమోదయ్యాయి. ఇద్దరు కెప్టెన్లు తీసుకున్న నిర్ణయాలు చర్చకు దారి తీస్తున్నాయి.. పాకిస్తాన్ జట్టు చెందిన తెల్లబంతి కెప్టెన్ బాబర్ అజామ్ తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. తన బ్యాటింగ్ పై మరింత దృష్టి సారిస్తానని పేర్కొన్నాడు. దాన్ని మర్చిపోకముందే న్యూజిలాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ టిమ్ సౌథి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 2, 2024 / 03:01 PM IST

    Tim Southee

    Follow us on

    Tim Southee : టిమ్ సౌథి సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు.. తాను తీసుకున్న ఈ నిర్ణయం జట్టుకు మేలు కలిగిస్తుందని అతడు ప్రకటించాడు. ఇటీవల న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటించింది. 0-2 తేడాతో దారుణమైన ఓటమి చవిచూసింది. దీంతో న్యూజిలాండ్ జట్టుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. టెస్ట్ ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను తెరపైకి తీసుకొచ్చిన తొలి సీజన్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. భారత జట్టును గురించి గదను దక్కించుకుంది. ఇక 2022 డిసెంబర్లో కేన్ విలియంసన్ నుంచి టిమ్ సౌథి సారధ్య బాధ్యతలను స్వీకరించాడు.. అతని ఆధ్వర్యంలో న్యూజిలాండ్ జట్టు 14 టెస్టులు ఆడింది. ఇందులో ఆరు విజయాలు, ఆరు ఓటములున్నాయి.. రెండు మ్యాచ్ లు డ్రా అయ్యాయి.

    కెప్టెన్సీ నుంచి తప్పిన తర్వాత టిమ్ సౌథి సంచలన వ్యాఖ్యలు చేశాడు..” టెస్ట్ క్రికెట్ అనేది నాకు అత్యంత ఇష్టమైన ఫార్మాట్. న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించడం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. నా కెరియర్ పరంగా చూసుకుంటే ఎల్లప్పుడూ జట్టును ముందు వరుసలో ఉంచడానికి ప్రయత్నించాను. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదని భావిస్తున్నాను. ఇకపై మైదానంలో నా ప్రదర్శన పై దృష్టి సారిస్తాను. వికెట్లను పడగొడతాను. టెస్టులలో జట్టును గెలిపించడానికి నా వంతు ప్రయత్నాలు చేస్తాను. గతంలో లాగానే నా సహచరులకు సహకరిస్తాను. అంతర్జాతీయ వేదికపై దూకుడు కొనసాగిస్తున్న యువ బౌలర్లకు నా వంతుగా మద్దతు ప్రకటిస్తుంటాను. టామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో.. అతనికి నా సహకారాలు ఉంటాయి. ఇప్పటివరకు అతడు నాకు సహకరించాడు. నేను టామ్ కు అండగా ఉంటానని” టిమ్ సౌథి వెల్లడించాడు. కాగా, టిమ్ సౌథి స్థానంలో లాథమ్ ను న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ గా మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్ గా లాథమ్ 82 టెస్టులు, 147 వన్డేలు, 26 t20 లు ఆడాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ లోకి టిమ్ సౌథి ఎంట్రీ ఇచ్చాడు.. అతడు 382 వికెట్లు పడగొట్టాడు. 102 టెస్టులు ఆడాడు. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్ జట్టు భారత్ వేదికగా మూడు టెస్టుల సిరీస్ ఆడుతుంది. లాథమ్ కొత్తగా కెప్టెన్ గా ఎంపికైన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్ జట్టు భారత్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభించక ముందే అనేక కుదుపులు మొదలవుతున్నాయని.. ఆ జట్టు కూడా బంగ్లాదేశ్ లాంటి ఫలితాన్ని చవి చూస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.