Virender Sehwag : అందువల్లే వీరేంద్ర సెహ్వాగ్ కు డాషింగ్ ఓపెనర్ అనే బిరుదు వచ్చింది.. ప్రత్యర్థి బౌలర్ పై ఏమాత్రం కనికరం లేకుండా ఎదురు దాడికి దిగే అతని బ్యాటింగ్ ను అప్పట్లో అభిమానులు స్టేడియాలలో కళ్లప్పగించుకుని చూసేవారు. టీవీలకు ప్రేక్షకులు అతుక్కుపోయి వీక్షించేవారు. అందుకే వీరేంద్ర సెహ్వాగ్ కు నాడు నేడు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడిదాకా ఎందుకు పాకిస్తాన్ జట్టుపై ఒక సిరీస్ లో నిర్దాక్షిణ్యంగా బ్యాటింగ్ చేసి భారత జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. టెస్టులలో ట్రిబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. వన్డేలలో కూడా అద్భుతమైన పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ వచ్చేదాకా టీమిండియాలో డాషింగ్ ఓపెనర్ అంటే వీరేంద్ర సెహ్వాగ్ అని అందరూ అనుకునేవారు. రోహిత్ శర్మ వచ్చిన తర్వాత.. వీరేంద్ర సెహ్వాగ్ కు సరైన వారసుడు ఎంట్రీ ఇచ్చాడని అప్పట్లో జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ కు నిజమైన వారసుడు వచ్చాడు. అతని రక్తం పంచుకుని పుట్టిన కొడుకు దేశవాలి క్రికెట్ లో సంచలనాలను సృష్టిస్తున్నాడు.
డబుల్ సెంచరీ చేశాడు
వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్య వీర్ సెహ్వాగ్ అదరగొడుతున్నాడు. అతని తండ్రి లాగానే దూకుడైన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు కూచ్ బెహార్ ట్రోఫీలో భాగంగా మేఘాలయ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడు ద్వి శతకం చేశాడు. 229 బంతులు ఎదుర్కొని అజేయంగా డబుల్ సెంచరీ చేశాడు. ఇందులో 34 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో మేఘాలయ జట్టు 260 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ జట్టు ఆర్యవీర్ దూకుడు అయిన ఆటతీరుతో రెండవ రోజు ఆట మూసే సమయానికి.. రెండు వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. ఆర్యవీర్ ప్రారంభం నుంచి మేఘాలయ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన తండ్రి లాగానే బలమైన మణికట్టు షాట్లు ఆడాడు. కవర్ డ్రైవ్ లు, స్ట్రైట్ షాట్లు, అప్పర్ కట్ లతో తన తండ్రిని మరిపించాడు..” అతడు దూకుడుగా ఆడుతున్నాడు. అతడి కళ్ళల్లో ఏమాత్రం భయం కనిపించడం లేదు. బౌలర్ ఎవరనేది లెక్కపెట్టడం లేదు. మైదానంలో పాతుకుపోయాడు. అంతలా ఆడుతున్నా అతడికి అలసట రావడం లేదు. బహుశా అతనిపై వీరేంద్ర సెహ్వాగ్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తోందని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. “ఆర్యవీర్ ఇలాగే ఆడితే టీమిండియా కు అరి వీర భయంకరమైన ఓపెనర్ దొరికినట్టేనని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.