Virat Kohli Arrest : కన్నడ జట్టు అటు ప్రభుత్వం మీద.. ఇటు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చింది. కన్నడ క్రికెట్ సంఘం కూడా ఎటువంటి ముందస్తు సౌకర్యాలు కల్పించకుండానే.. విజయ యాత్ర నిర్వహించాలని భావించిందని తెలుస్తోంది. కన్నడ జట్టు విజయం సాధించిన అనంతరం వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారని.. క్షణాల వ్యవధిలోనే అమలు చేయాలని నిర్ణయించుకున్నారని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. తమ రాజకీయ ప్రాపకం కోసం కొంతమంది నేతలు.. కన్నడ క్రికెట్ సంఘంలో కీలకంగా ఉండే వ్యక్తులు.. బెంగళూరు యాజమాన్యంలో కొంతమంది పెద్దలు విజయ యాత్ర నిర్వహించడానికి మొగ్గు చూపించారని.. పోలీసులు భద్రతాపరమైన సమస్యలను వివరించినప్పటికీ వినిపించుకోలేదని తెలుస్తోంది.. అందువల్లే ఈ దారుణం జరిగిందని సమాచారం. వాస్తవానికి అక్కడ స్టేడియం సామర్థ్యం 35000 మాత్రమే. కానీ దాదాపు లక్షలలో అభిమానులు కర్ణాటక రాజధాని రోడ్లమీదకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పిందని తెలుస్తోంది. ఎంతకి మైదానం ద్వారాలు తెరవకపోవడంతో.. సహనం నశించిపోయిన అభిమానులు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారని.. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారని.. అందువల్లే ఈ దారుణం చోటుచేసుకుందని సమాచారం.
Also Read : అందరూ క్షేమంగా ఉండండి: విరాట్ కోహ్లీ
ఇక ఈ వ్యవహారంలో కర్ణాటక ఖాకీలు అరెస్టుల పర్వాన్ని మొదలుపెట్టారు. దీనికంటే ముందు సోషల్ మీడియాలో కన్నడ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మీద ఒక యుద్ధం సాగుతోంది.. కర్ణాటక రాజధానిలో చోటు చేసుకున్న తొక్కిసలాటకు బాధ్యుడిని చేసి.. కన్నడ జట్టు రన్ మాస్టర్ ను అరెస్టు చేయాలని సామాజిక మాధ్యమాలలో #ArrestVirat Kohli అనే యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.. ఇప్పటికే ఈ యాష్ ట్యాగ్ మీద వేలాది ట్వీట్లు నమోదయ్యాయి. ” పదికి మించి అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయాల పాలయ్యారు.. వారంతా కూడా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి బాగోలేదు. అటు ప్రభుత్వం, ఇటు బెంగుళూరు జట్టు, కన్నడ క్రికెట్ సంఘం పరిహారం ఇస్తామని సొల్లు కబుర్లు చెబుతున్నాయి. అంతకుమించి డబ్బులు తిరిగి ఇచ్చేస్తే ప్రాణాలు తిరిగి తెస్తారా? ఇది సాధ్యమవుతుందా? అందువల్లే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.. కానీ అవేవీ జరగలేదు. ఇంతకంటే దారుణం మరొకటి ఏముంటుందని” సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు కోహ్లీ అభిమానులు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. We love you Kohli అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. “విరాట్ కేవలం ఆటగాడు మాత్రమే. ఇటువంటి నిర్ణయాలతో అతడికి సంబంధం లేదు. అతడిని ఆ వివాదంలోకి ఎందుకు లాగుతున్నారు. ఇలాంటి పద్ధతి మంచిది కాదు. అనవసరంగా విరాట్ కోహ్లీని ఇబ్బంది పెట్టొద్దు. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. జట్టు విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. అటువంటి వ్యక్తిని ఇలా అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం సరికాదని” అతడి అభిమానులు పేర్కొంటున్నారు.