Virat Kohli : క్రికెట్ లో ఎంతటి తోపు బ్యాటర్ అయినా ఏదో ఒక సందర్భంలో అవుట్ కావాల్సిందే.. అలా అవుట్ అయినప్పుడు బ్యాటర్ లో విపరీతమైన ఆగ్రహం వస్తుంది. పట్టరాని కోపంతో వెళ్లిపోతారు. కానీ ఈ బ్యాటర్ మాత్రం పూర్తి విభిన్నం. తనను అవుట్ చేసిన బౌలర్ కు అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. ఇంతకీ ఎవరు ఆ బౌలర్? అతనికి ఆ బ్యాటర్ ఎలాంటి బహుమతి ఇచ్చాడు?
ఐపీఎల్ జోరుగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారుతోంది. పాయింట్లు పట్టికలో కోల్ కతా, రాజస్థాన్ జట్లు స్థిరంగా ఉండగా.. మూడు, నాలుగు స్థానాల్లో తరచూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు బెంగళూరు శాయశక్తులా కృషి చేస్తోంది.. ఐపీఎల్ మొదటి మొదటి స్పెల్ లో దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన బెంగళూరు.. ఇప్పుడు విజయాలతో ఆకట్టుకుంటున్నది.
గత శనివారం చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముందుగా బౌలింగ్ చేసి గుజరాత్ జట్టును 147 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. 148 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగి ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగళూరు కెప్టెన్ డూ ప్లేసిస్ 64, విరాట్ కోహ్లీ 42 రన్స్ చేయడంతో బెంగళూరు విజయం ఈజీ అయిపోయింది.. 42 పరుగులు చేసి, అర్థ సెంచరీ వైపు కదులుతున్న కోహ్లీని గుజరాత్ బౌలర్ నూర్ అహ్మద్ అవుట్ చేశాడు. నూర్ అహ్మద్ వేసిన 11 ఓవర్ నాలుగో బంతిని కవర్స్ దిశగా బలంగా కొట్టేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. కానీ ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో కోహ్లీ నిరాశగా మైదానాన్ని వీడాడు. కోహ్లీ వికెట్ దక్కించుకోగానే నూర్ అహ్మద్ సంబరాలు చేసుకున్నాడు. ఎందుకంటే నూర్ అహ్మద్ ఆరాధ్య క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ది ప్రథమ స్థానం. అతడి వికెట్ దక్కడంతో నూర్ అహ్మద్ ఆనందానికి అవధులు లేవు.
తన వికెట్ తీసిన అనంతరం నూర్ అహ్మద్ ఆనందాన్ని కోహ్లీ గమనించాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత కింగ్ కోహ్లీ తాను ధరించే జెర్సీని అహ్మద్ కు బహుమతిగా ఇచ్చాడు. “అద్భుతమైన బౌలింగ్.. శుభాశీస్సులు” అంటూ జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి బహుమతిగా ఇచ్చాడు. ఈ ఫోటోలను నూర్ అహ్మద్ సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు..” విరాట్ కోహ్లీ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. అతడు నా ఆరాధ్య క్రికెటర్” అంటూ నూర్ అహ్మద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. మరోవైపు కోహ్లీ చేసిన పని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతడు ఎప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అని కొనియాడుతున్నారు. అయితే వరుసగా మూడు మ్యాచ్లలో విజయాలు సాధించడంతో, బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.