Virat Kohli Craze: విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే దాదాపు 1. 5 కోట్ల వరకు వసూలు చేస్తారు. దీనినిబట్టి అతని స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. టెస్ట్ ఫార్మాట్, టి20 ఫార్మాట్ నుంచి అతడు తప్పుకున్నప్పటికీ.. క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పైగా ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోతున్న వన్డే సిరీస్ లో అతడు ఆడుతున్నాడు. దీంతో అభిమానుల కళ్ళు మొత్తం విరాట్ కోహ్లీ మీద ఉంటాయి. అతడు మైదానంలో దిగి ప్రాక్టీస్ చేస్తుంటే ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. విరాట్ విరాట్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
విరాట్ కోహ్లీ పెర్త్ మైదానంలో సహచర టీమ్ ఇండియా ప్లేయర్లతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. బ్యాట్ చేత పట్టుకొని చెమటలు చిందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ చూసేందుకు ఆస్ట్రేలియాలో అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు. అతని ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడుతున్నారు. ఆస్ట్రేలియా మీడియా కూడా విరాట్ కోహ్లీ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పదేపదే ప్రస్తావిస్తోంది. విరాట్ కోహ్లీ చూసేందుకు అభిమానులు భారీగా వస్తున్నారని.. అతడితో ఆటోగ్రాఫ్ లు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని రాస్కొచ్చింది. దానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అక్టోబర్ 19 న టీమిండియా, ఆస్ట్రేలియా పెర్త్ వేదికగా తొలి వన్డే ఆడబోతున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున ఆడుతున్న నేపథ్యంలో అతని మీద అభిమానులకు అంచనాలు విపరీతంగా ఉన్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ లో విరాట్ కొనసాగాలంటే ఆస్ట్రేలియా సిరీస్లో కచ్చితంగా ఆకట్టుకోవాల్సి ఉంటుంది. పైగా ఆస్ట్రేలియా గడ్డమీద విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. సచిన్, రోహిత్ తర్వాత ఆ స్థాయిలో పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా అంటేనే రెచ్చిపోయే విరాట్ కోహ్లీ ఈసారి కూడా ఆదే స్థాయిలో ఆడతాడని అభిమానులు భావిస్తున్నారు.
విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టాడు. తద్వారా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇండియాలో ఉంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అతడు కుటుంబ జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాడు. అందువల్లే కొంతకాలంగా లండన్ లో ఉంటున్నాడు. కుటుంబంతో కలిసి లండన్ ప్రాంతంలో విహరిస్తున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ కోసం అతడు నేరుగా లండన్ నుంచి ముంబై వచ్చాడు. ఆ తర్వాత జట్టు ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియా వెళ్ళాడు. భారత ప్లేయర్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.చాలా కాలం తర్వాత మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్ కోహ్లీని చూసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ఆస్ట్రేలియా గడ్డమీద దుమ్మురేపాలని కోరుకుంటున్నారు.
FANS ARE RUNNING TOWARDS VIRAT KOHLI FOR AN AUTOGRAPH & SELFIE IN PERTH…!!! ❤️
– King, An Emotion to all. [Espn Cricinfo] pic.twitter.com/NkoMJVZQJk
— Johns. (@CricCrazyJohns) October 17, 2025